India Business Conference 2024 Northwestern university USA invites KTR: హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (BRS Working President KTR)కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (India Business Conference) కు  హాజరు కావాలని కేటిఆర్ కు ఆహ్వానం అందింది. అమెరికాలోని ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13న నిర్వహించనున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వానించారు. 


సదస్సులో ప్రసంగించనున్న కేటీఆర్ 
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రిగా కేటీఆర్ సేవలు అందించారు. పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన పాలసీలు, అవి సాధించిన విజయాలను సదస్సులో వివరించాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ (Northwestern Kellogg) స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎగ్సిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్వేత మేడపాటి ఓ లేఖలో విజ్ఞప్తి చేశారు.


బెస్ట్ బిజినెస్ ర్యాంకింగ్ లో 2వ స్థానం 
అమెరికాలోని ఇవాన్ స్టన్ లో 1908లో నెలకొల్పిన ఈ బిజినెస్ స్కూల్ ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ బిజినెస్ ర్యాంకింగ్ (Best Business Rankings) లో 2వ స్థానంలో నిలిచిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం భారత్ (India) లో పారిశ్రామిక రంగంలో కొత్త అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, క్షేత్రస్థాయిలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అంశంపై చర్చించనున్నారు. ఇందుకుగానూ ఇండస్ట్రీ లీడర్లను, వ్యాపారవేత్తలను, విధానాల రూపకల్పనలో అనుభవం కలిగిన నేతలను ఏకతాటిపైకి తేవాలన్న ఆలోచనతోనే ఈ సదస్సును నిర్వహిస్తున్నామని శ్వేత మేడపాటి తెలిపారు. కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న ఆశయంతో యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు ఆమె వివరించారు.
Also Read: రజాకార్ మూవీకి పన్ను మినహాయింపు ఇవ్వండి - రేవంత్ కు బండి సంజయ్ లేఖ