Hyderabad News Fake RPF SI Malavika Arrested: సికింద్రాబాద్: జాబ్ రాకున్నా.. ఎస్సై అని చెలామణి అవుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్ ఎస్సైగా చెప్పుకుంటూ యూనిఫారం వేసుకుని డ్యూటీ చేస్తున్న యువతి ఆట కట్టించారు. ఆర్పీఎఫ్ ఎస్సై అని ప్రచారం చేసుకుంటున్న నకిలీ సుడో రైల్వే ఎస్సై మాళవికను అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసులు (Railway Police) వెల్లడించారు. మీ చుట్టుపక్కల ఎవరి మీద అనుమానం ఉన్నా తమకు సమాచారం అందించాలని ప్రజలకు పోలీసులు సూచించారు. అసలే ఓవైపు అవినీతి అధికారుల ఘటనలు చూస్తుంటే, మరోవైపు నకిలీ అధికారులు, ఉద్యోగుల బాగోతం ఏదో బయట పడుతూనే ఉన్నాయి.
అసలేం జరిగిందంటే..
నార్కట్ పల్లికి చెందిన మాళవిక అనే యువతి నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం యత్నించిన మాళవిక 2018 లో ఆర్పీఎఫ్ ఎస్సై ఎగ్జామ్ రాసింది. కానీ కంటి సమస్య ఉండడంతో మెడికల్ టెస్టుల్లో ఆమె క్వాలిఫై కాలేదు. కానీ స్వగ్రామం నార్కట్ పల్లిలో ఎస్సైగా చెలామణి అవుతోంది మాళవిక. శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు యువతి అందర్నీ నమ్మించింది. ఆమె మాటలు విన్నవారు నిజంగానే ఆమె ఆర్పీఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తుందని అనుకున్నారు.
పెళ్లి చూపులకు సైతం యూనిఫాంలోనే వెళ్లిన యువతి
ఇటీవల ఆమెకు పెళ్లి సంబంధం చూశారు. పెళ్లి చూపులకు సైతం మాళవిక యూనిఫాం లోనే వెళ్లింది. ఆర్పీఎఫ్ ఎస్సై అని ఐడీ కార్డు తయారు చేసుకుంది. యూనిఫాం ధరించి నిజంగానే డ్యూటీ చేస్తున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్లు ఉన్నతాధికారులను సంప్రదించగా అసలు నిజం బయటపడింది. ఉద్యోగం రాలేదని తల్లిదండ్రులు బాధ పడుతున్నారని, అందుకే ఈ పనిచేసినట్లు యువతి మాళవిక తెలిపింది. ఆర్పీఎఫ్ యూనిఫాంలో ఆమె రీల్స్ సైతం చేసింది. గత ఏడాది నుంచి ఆర్పీఎఫ్ ఎస్సైగా యువతి చెలామణి అవుతున్నట్లు రైల్వే పోలీసులు నిర్ధారించారు.
Also Read: ఇబ్రహీంపట్నంలో పరువు హత్య- వద్దన్నా ప్రియుడితో మాట్లాడుతోందని హత్య చేసిన తల్లి