Global EduFest 2023: విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యని అభ్యసించాలనుకునే విద్యార్థులని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు టీ హబ్ సహకారంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫారిన్ స్టడీస్ (ఐఎంఎఫ్ఎస్) 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023'ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లాండ్ తదితర దేశాలకు చెందిన 100కి పైగా విదేశీ విశ్వ విద్యాలయాలకి చెందిన 60 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. ఒక రోజంతా జరిగే ఈ సదస్సులో విద్యార్థులకు లోన్లు అందించే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రిపరేషన్ టెస్ట్ ఏజెన్సీలైన ఈటీఎస్, పీటీఈ, ఇన్సూరెన్స్ కంపెనీలు, ఫారెక్స్ రెమిటర్ లు వంటి వివిధ భాగస్వామ్య సంస్థలు కూడా హాజరు కాబోతున్నాయి.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు వారిలో ఉన్న అని అనుమానాలను తొలగించనున్నారు. వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకోకున్నారు. యూఎస్ కాన్సులేట్‌కి చెందిన కాన్సులర్ అధికారులు యూఎస్ఏ స్టడీ, యూఎస్ వీసా ప్రాసెస్ గురించి ప్రత్యేకంగా సెమినార్ నిర్వహిస్తారు.
ఈ 'గ్లోబల్ ఎడ్యుఫెస్ట్ 2023'ని ఉదయం 10.30 గంటలకి విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30 గంటల వరకు ఈ సదస్సు కొనసాగనుంది. ముఖ్య అతిథులుగా టీఎస్‌సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాసరావు, టీపీఎస్‌సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ హైకోర్టు సీనియర్ న్యాయవాది వి.పట్టాభి హాజరు కానున్నారు.