Telangana Rains | హైదరాబాద్: మండుతున్న ఎండల సమయంలో భారత వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. తెలంగాణలో పల్లె జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అది కూడా ఒకటి రెండు కాదు మూడు రోజులపాటు మన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఏప్రిల్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు వర్షాలు పడనున్నాయని, గరిష్ట ఉష్ణోగ్రతలు మూడు నుంచి నాలుగు డిగ్రీల మీద దిగిరానున్నాయి.

అటు ఉత్తర తెలంగాణతోపాటు ఇటు దక్షిణ తెలంగాణలోనూ పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఏప్రిల్ ఒకటి నుంచి మూడో తేదీ వరకు అదిలాబాద్, నిర్మల్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి,  రంగారెడ్డి,  వికారాబాద్, మహబూబ్నగర్ జోగులాంబ గద్వాల్ వనపర్తి జిల్లాల్లో తేలికపాట్ నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉంది. ఏప్రిల్ నాలుగో తేదీన సైతం తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాష్ట్రంలో మూడు, నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఏప్రిల్ 2న మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్న వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 1, ఏప్రిల్ 3 తేదీలలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది.