Hyderabad ORR Toll Fees | హైదరాబాద్: విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై టోల్ ఛార్జీలు తగ్గించారని సంతోషించేలోపే వాహనదారులకు మరో షాకింగ్ న్యూస్ వచ్చింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (Hyderabad Outer Ring Road)పై టోల్ ఛార్జీలు పెరిగాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి సవరించిన ఛార్జీలు అమలులోకి రానున్నాయి. హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌పై ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తోందని తెలిసిందే. నగరంలోని ఓ మూల నుంచి మరో మూలకు వెళ్లాలంటే సిటీ మధ్యలో నుంచి కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును ఎంచుకుంటున్నారు. తద్వారా వారి సమయం, శ్రమ తగ్గుతుంది. కానీ టోల్ ఛార్జీలు పెంచి నగర వాసులకు షాకిచ్చారు.
కార్లు, జీపులతో పాటు ఇతర లైట్ వెహికల్స్‌కు కిలోమీటర్‌పై 10 పైసలు పెంచారు. దీంతో కొత్త ఛార్జీ 2.34 రూపాయల నుంచి 2.44 రూపాయలకు పెరిగింది. మినీ బస్సులు, ఎల్‌సీవీలకు కిలోమీటర్‌కు 23 పైసలు పెరిగింది. దాంతో ఆ వాహనాలపై కిలోమీటర్‌కు 3.77 రూపాయల నుంచి 3.94 రూపాయలకు పెంచారు. 2 యాక్సిల్ బస్సులకు కిలోమీటరుకు 31 పైసలు పెరిగింది. దాంతో 2 యాక్సిల్ బస్సులపై కిలోమీటర్ ఛార్జీ 6.69 రూపాయల నుంచి 7 రూపాయలకు పెంచారు. భారీ వాహనాలకు ఒక కిలోమీటరుకు 15.09 రూపాయల నుంచి 15.78 రూపాయలకు పెంచారు.
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (Hyderabad ORR) దీనిని అధికారికంగా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అని పిలుస్తారు. ఇది తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరాన్ని కవర్ చేసేలా 158 కిలోమీటర్లు (98 మైళ్ళు), ఎనిమిది లేన్ల రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్‌వే . ఈ ఎక్స్‌ప్రెస్‌వేను గంటకు 100 కిలోమీటర్ల (62 mph) వేగంతో రూపొందించారు. తరువాత దీనిని గంటకు 120 కిలోమీటర్ల (75 mph) కు పెంచారు. 158 కిలోమీటర్ల (98 మైళ్ళు)లో 124 కిలోమీటర్ల (77 మైళ్ళు) (పట్టణ నోడ్‌లను కవర్ చేసే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం , జీనోమ్ వ్యాలీ, హార్డ్‌వేర్ పార్క్, తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ, సింగపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మరియు గేమ్స్ విలేజ్) పెద్ద భాగం డిసెంబర్ 2012 నాటికి ప్రారంభించారు.
జనవరి 3, 2006న అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ హైదరాబాద్ శివార్లలోని శంషాబాద్ సమీపంలో ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్డు (ఫేజ్ I) కు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మరియు సమాచార సాంకేతికత మరియు ఇతర పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే విస్తృత దృక్పథంలో ఈ ప్రాజెక్ట్ భాగం.
ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ, వరంగల్ వరకు NH 44 , NH 65 , NH 161 , NH 765, NH 163 ల మధ్య సులభంగా కనెక్టివిటీని అందిస్తుంది. అలాగే వికారాబాద్, నాగార్జున సాగర్, కరీంనగర్ / మంచిర్యాలకు వెళ్లే రాష్ట్ర రహదారులను కలుపుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిజామాబాద్ తో పాటు ఆదిలాబాద్ వంటి నగరాలకు NH44 కి అనుసంధానించడం వలన ప్రయాణ సమయాన్ని తగ్గించడంలో దోహదం చేస్తోంది. 33 రేడియల్ రోడ్లు దీనిని ఇన్నర్ రింగ్ రోడ్, త్వరలో రీజినల్ రింగ్ రోడ్‌తో ఇంటర్ కనెక్ట్ చేయనున్నారు.