కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు అతలాకుతలమైన తెలంగాణకు భారత వాతావరణ శాఖ (హైదరాబాద్) మరోసారి రెడ్ అలెర్ట్ ప్రకటించంది. జూలై 25 నుంచి తెలంగాణ తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మెహబూబ్‌నగర్, నాగర్‌కర్నోల్, సిద్దిపేట, జనగాం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌లలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.


జులై 27 వరకు కొనసాగనున్న వర్షాలు
జూలై 26న తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మధ్య తెలంగాణలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాక తెలిపింది. హైదరాబాద్, పరిసర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భాగ్యనగరం హైదరాబాద్‌లో జులై 27న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం  ఉందని హెచ్చరించింది. 


హైదరాబాద్‌‌కు రెడ్ అలర్ట్ 
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ  ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మొత్తం ఆరు జోన్‌లు - చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నగరంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు. జులై 26, 27 తేదీల్లో హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణాలో నిజామాబాద్‌లో అత్యధికంగా 464 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.  హైదరాబాద్‌లో చార్మినార్‌లో 79 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) నివేదించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. తమ ప్రయాణాలను పక్కాగా ప్లాన్ చేసుకోవాలని సూచించింది. 


గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచి నగరం అంతటా తీవ్ర ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ప్రజల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి.  అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న రోడ్డుతోపాటు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైన సందర్భాలు ఉన్నాయి. దీనిపై చాలా మంది ట్విట్టర్ వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తమ ఆవేదన,  అసంతృప్తిని వ్యక్తం చేశారు.  హైదరాబాద్ నగరం ఐటీతో పాటు ట్రాఫిక్‌లోనూ బెంగళూరుతో పోటీ పడుతోందని విమర్శించారు. కేవలం గంటసేపు కురిసిన వర్షంతో రోడ్లపై గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. గంట సేపు వర్షం కురిస్తే భాగ్యనగరం పరిస్థితి ఇదీ అంటూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. బెంగుళూరు, హైదరాబాద్ ట్రాఫిక్‌లను పోలుస్తూ.. త్వరలో హైదరాబాద్ బెంగళూరును దాటేస్తుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు.


చార్మినార్‌లో అత్యధికంగా 79 మిల్లీ మీటర్లు
తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) గణాంకాల ప్రకారం, హైదరాబాద్‌లో గత 24 గంటల్లో చార్మినార్‌లో అత్యధికంగా 79 మిమీ వర్షపాతం నమోదైంది. అంబర్ పేట్ 71.5, గోల్కొండ 71, బహుదుర్ పురా 69.3, సైదాబాద్ 69.3, బండ్లగూడ 67, ఆసిఫ్ నగర్ 65.3, సికింద్రాబాద్ 65, షేక్ పేట్ 64.3, నాంపల్లి 64.3, ఖైరతాబాద్ 63.8, హిమాయత్ నగర్ 62.3, మారేడుపల్లి 55.8, ముషీరాబాద్ 54.3, తిరుమలగిరి 54, అమీర్ పేట్‌లో 52.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.