Jubilee Hills By Election | హైదరాబాద్: మాగంటి గోపీనాథ్ కుమారుడు తారక్ నెల రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఫిర్యాదు చేయాలని అడగడానికి బదులుగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే, మాగంటి గోపీనాథ్ డెత్ మిస్టరీపై పూర్తి దర్యాప్తునకు ఆదేశించాలని ఛాలెంజ్ చేశారు. 90 ఏళ్ల వృద్ధురాలైన తల్లిని సైతం చివరిసారిగా కుమారుడ్ని సందర్శించడానికి నిరాకరించారు. బతికున్న భార్యను కాగితంపై చనిపోయినట్లు ప్రకటించారు. కానీ వారి కొడుకు బెదిరింపులతో సైలెంట్ అయ్యారు.

Continues below advertisement

రికార్డులను అంత తేలికగా తారుమారు చేయగలిగితే, బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమి చేయగలదో ప్రజలు తెలుసుకోవాలన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థికి రెండు ఓటరు ఐడిలు ఉన్నాయని, ఇది పొలిటికల్ గేమ్ అని గుర్తించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ట్విట్టర్ టిల్లు దివంగత ఎమ్మెల్యే మాగంగి గోపీనాథ్ ఆస్తులపై ఫోకస్ చేశారని, మిగిలిన ఆస్తులు లాక్కోవాలనుకుంటున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక కుటుంబం పోరాటం కాదు - ఇది ప్రతి ఇంటిని తినేసే అవినీతి గురించి కనుక.. ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించి బీజేపీకి ఓటు వేయాలని బండి సంజయ్ కోరారు.

జూబ్లీహిల్స్‌పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు.. 

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్‌లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఏడు రోజులుగా ఇక్కడ బస్తీల్లో పర్యటిస్తున్నానని, జూబ్లీహిల్స్ పేరుకు మాత్రమే గొప్పగా ఉందని, లోపల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని విమర్శించారు. తాము నిలబడిన ఈ మధురానగర్‌లో కూడా కంపు కొడుతోందని, పేద ప్రజలు దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

"పేదవాళ్ళమే అయినా మంచి, చెడు ఆలోచన చేయగలవాళ్ళం. కేవలం జై కొట్టడానికే కాదు, ఎవరికి ఓటు వేయాలో తెలిసిన వాళ్ళం" అని ఈటల అన్నారు. ప్రజలు తమ వాడు ఎవరో, మాటలు చెప్పేవాడు ఎవరో, పని చేసేవాడు ఎవరో తెలుసుకోవాలని, లేదంటే ఆగం అవుతామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ ఒకరినొకరు విమర్శించుకోవడం తప్ప, ప్రజలకు ఏం చేస్తామో చెప్పే దమ్ము కాంగ్రెస్‌కు లేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గతుకుల రోడ్లు బాగు చేయలేదని, మంచి నీరు అందించడం లేదని, పరిసరాలు కంపు వాసనతో ఉన్నాయని దుయ్యబట్టారు.

పెన్షన్, నిరుద్యోగ భృతిపై నిలదీయండి

సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మీటింగ్స్ పెడుతున్నారని, ఆయనను మహిళలు 'రూ. 2,500 ఎక్కడ?' అని, ఆటో డ్రైవర్లు 'ఆత్మహత్యలు చేసుకుంటుంటే రూ. 12 వేలు ఇస్తామన్న మాట ఏమైంది?' అని నిలదీయాలని ఈటల ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే రూ. 4 వేల పెన్షన్, రూ. 6 వేల రూపాయల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించాలని కోరారు. "మన పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా ఇవ్వడం లేదు, రూ. 10 వేల కోట్లు పెండింగ్ పెట్టారు, ఎప్పుడు ఇస్తారని అడగండి. నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతిని అడగాలని సూచించారు. ఇవన్నీ ఇవ్వడు కానీ, మళ్లీ ఓటు ఏం మొహం పెట్టుకొని అడుగుతున్నాడో నిలదీయాలన్నారు.

ఓటుకు రూ. 2 వేలు పంచుతున్నారని వస్తున్న వార్తలపై స్పందిస్తూ, "ఎవరి అబ్బ సొమ్ము అని పంచుతున్నారు?" అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వడం లేదు కానీ, హైడ్రా పెట్టి పేదల గుడిసెలు కూల్చుతున్నారని ఆరోపించారు. హైడ్రా అరాచకాలను అడ్డుకుని, మీ కోసం వచ్చింది ఒక్క బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.

దేశంలో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలన్నా, ప్రశాంతంగా జీవించాలన్నా, ప్రపంచ పటంలో గొప్పగా ఉండాలంటే నరేంద్ర మోదీ నాయకత్వం అవసరమని ఈటల ఉద్ఘాటించారు. ఆరు గ్యారెంటీలతో బరిలోకి దిగి కొట్లాడేది ఒక్క బీజేపీ మాత్రమేనని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఆ ప్రభుత్వం పడిపోదని, కానీ బీజేపీకి ఓటు వేస్తే పేదల ఇళ్ల జాగాల కోసం, పెన్షన్ కోసం, ఫీజుల కోసం కొట్లాడుతుందని చెప్పారు. "జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గతంలో 48 స్థానాలు గెలిపించారు. మళ్లీ జీహెచ్‌ఎంసీలో ఎగిరేది బీజేపీ జెండానే" అని ధీమా వ్యక్తం చేశారు.

"ఆలోచన చేసి ఓటు వేయండి. ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మీకోసం, మీ ఆత్మగౌరవం కోసం వేసుకోండి," అని ఈటల రాజేందర్ ప్రజలకు సూచించారు. "వేల కోట్లు సంపాదించి తీసుకువచ్చి ఇక్కడ పంచి పెడుతున్నారు. హుజురాబాద్‌లో ఆరు వేలు కాదు, ఆత్మగౌరవం కోసం ఓటు వేశారు. పేదవాళ్ళమే కానీ ఆత్మగౌరవం తక్కువ లేదని నిరూపించండి," అని కోరారు. ధర్మం, న్యాయం, కొట్లాడే బిడ్డల కోసం ఓటు వేయాలని, పేదవాళ్ల కోసం కొట్లాడే పార్టీ బీజేపీ మాత్రమేనని చెబుతూ, దీపక్ రెడ్డికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.