BC Reservations in Telangana | హైదరాబాద్: బీసీలపై నిజంగా ప్రేమ, వారి అభివృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వం వారికి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, లేకపోతే భూకంపం సృష్టిస్తామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్ లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటించిన 42 శాతం రిజర్వేషన్ ను తప్పనిసరిగా అమలుచేయాలి. కులగణన లెక్కలు తప్పులతడకగా ఉన్నాయి.
చట్టబద్ధత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్
బీసీ రిజర్వేషన్ బిల్లుపై చట్టసభల్లో మాట్లాడటం లేదు. కేబినెట్ లో పెట్టినా పబ్లిక్ డొమైన్ లోకి రాలేదు. హడావుడిగా అసెంబ్లీలో బిసి బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారు. ఇది బ్రహ్మపదార్థం అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఆరు నూరైనా సరే సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత వచ్చాకే ఎన్నికలకు వెళ్లాలి. మేం ఎవరిని అడుక్కోవడం లేదు. బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేపించాయి.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ బిసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. బీసీల రిజర్వేషన్ కోసం ప్రభుత్వం ఇప్పడు డిక్లరేషన్ అంటుంది... బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టారు. 9 వ షెడ్యూల్ లో చేర్చి పార్లమెంటులో ఆమోదిస్తేనే బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత వస్తుంది, 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత కల్పించాకే ఏ ఎన్నికలైనా జరపాలి. లేకపోతే మా సత్తా చూపిస్తాం. బీసీల ఐక్యత చాటి చెప్పే రోజు వస్తుంది. ఒకప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం చూశారు. ఇప్పుడు బిసీల ఉద్యమం చేపడతాం. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుంటే మీ అధికారాన్ని లాక్కుంటాం’ అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.
కామారెడ్డి డిక్లరేషన్ చేయాలని బీసీలు మిమ్మల్ని అడిగారా..ప్రజా ప్రతినిధుల సంఘం ఆధ్వర్యంలో ఏ పబ్లిసిటీ లేకుండానే బీసీ సోదరులు నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. యాదవులు, గౌడ్లు, మున్నూరు కాపు, చాకలి, మంగలి సహా ఇతరత్రా బీసీ సంఘాలు ఏకమై రిజర్వేషన్లు సాధించుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు మనల్ని విడగొట్టాలని, మన మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ బిడ్డలు తలుచుకుంటే రాష్ట్రంలో భూకంపం వస్తుంది. కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచేందుకు మోసపూరిత హామీలు ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ సమయంలో బీసీలు ప్రశ్నిస్తే మాకు 125 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బడ్జెట్లో రూ.20 వేల కోట్లు పెడతామని ఎవరు హామీ ఇవ్వమన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు చేయమన్నారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్సార్, కేసీఆర్ తీర్మానాలు చేశారు. కానీ ఢిల్లీలో నేతలు సపోర్ట్ చేయకపోవడంతో చట్టబద్ధత రాలేదు. ఢిల్లీలో అఖిలపక్షం తీసుకెళ్లి ప్రధాని మోదీ మీద ఒత్తిడి చేయాలని మద్దతు కూడా తెలిపాం. అన్నింటిని మభ్యపెట్టేందుకు బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ తీర్మానం చేశారు. పక్కనున్న తమిళనాడులో తీర్మానాలు చేసినా చెల్లుబాటు అవ్వవు. వీటిని 9వ షెడ్యూల్ లో చేర్చితేనే కేంద్రం దానికి చట్టబద్ధత కల్పించినట్లు అవుతుంది. హైకోర్టు 3 నెలల్లోపే మూడు నెలల్లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు’ అని ప్రశ్నించారు.