Medak Congress Leader Dies | మెదక్: మెదక్ జిల్లా కొల్చారం మండలానికి చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ (35) అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. కొల్చారం మండలం వరిగుంతం గ్రామ శివారులో మెదక్ జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ జిల్లా సెక్రటరీ అనిల్ మృతదేహాన్ని కారులో గుర్తించారు.
బుల్లెట్లతో మారిన క్రైమ్ సీన్
మెదక్- హైదరాబాద్ రోడ్డు పక్కన వాహనం అదుపుతప్పి ప్రమాదం జరగడంతో చనిపోయాడని తొలుత భావించారు. కానీ ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు లభ్యం కావడంతో అనిల్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినా, అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని ఎస్సై మహ్మద్ గౌస్ తెలిపారు. పోలీసులు యువతనేత అనిల్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదం అనుకున్నారు.. కానీ..కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ మొదట రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు భావించారు. కానీ ఘటనా స్థలాన్ని పరిశీలించగా బుల్లెట్లు కనిపించాయని ఎస్సై గౌస్ తెలిపారు. సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామం పైతరకు కారులో బయలుదేరారు అనిల్. మండలంలోని చిన్నఘనపూర్ సబ్ స్టేషన్ వద్ద కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొట్టింది. అనంతరం రోడ్డు పక్కన చెట్టును కారు ఢీకొట్టినట్లు తెలిపారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అనిల్ ను స్థానికులు మెదక్ లోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రరక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ అనిల్ చనిపోయారు. అనిల్ మృతిపై కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తంచేశారు. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తే వారికి కొన్ని బుల్లెట్లు లభ్యం కావడంతో రోడ్డు ప్రమాదం కాదు, హత్య జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
చనిపోతూ తన ఎడమ చేతిపై అనిల్ ఓ ఫోన్ నెంబర్ రాశారని తెలుస్తోంది. హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో ఓ భూమి విషయంలో వివాదం ఉన్న సమయంలో అనిల్ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. నానక్ రామ్ గూడలోని 6 గుంటల స్థలం విషయంలో అనిల్ కు, మరొకరితో గొడవలు ఉన్నాయి.
కడప ఎమ్మెల్యే కుటుంబంతో వివాదంకడప జిల్లాకి చెందిన ఓ ఎమ్మెల్యే కుటుంబానికి, కాంగ్రెస్ నేత అనిల్ కి కొంతకాలం నుంచి ఓ భూమి విషయంలో వివాదం ఉన్నట్లు సమాచరం. ఆ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వద్ద 80 లక్షలు, కారు తెచ్చినట్లు సమాచారం. 5 నెలలనుంచి బెంజ్ కారు అనిల్ వద్దనే ఉంటుంది.
మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద అనిల్(28) తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రియల్ ఎస్టేట్ లో అనిల్ ఎదుగుదలను ఓర్వలేకే హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. హత్యకు రియల్ ఎస్టేట్ గొడవలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనిల్ డ్రైవ్ చేస్తున్న కారు విషయంలోను గొడవ జరిగిందని సమాచారం. ఓ సెటిల్ మెంట్ విషయంలో అనిల్ బెంజ్ కారు తీసుకువచ్చినట్టు ప్రచారం జరుగుతోందన్నారు.