Smita Sabharwal : తెలంగాణలోని అత్యంత వివాదాస్పదమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కేసులో, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టులో స్మితా సభర్వాల్ దాఖలు చేసిన పిటిషన్ ద్వారా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేశారు. కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలు, లోపాలపై సమీక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ నివేదికను ఆగస్టు 2025లో అసెంబ్లీలో టేబుల్ చేశారు.
కమిషన్ రిపోర్టులో స్మితా సభర్వాల్‌తో సహా మొత్తం 19 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ సెక్రటరీగా తొమ్మిదేళ్లు పనిచేసిన స్మితా సభర్వాల్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో కీలక పాత్ర పోషించారని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను ఆమె పలు సందర్భాల్లో సందర్శించిన ఫోటోలు, జిల్లా అధికారుల నుంచి సేకరించిన ఫీడ్‌బ్యాక్‌లను కూడా నివేదికలో పొందుపరిచింది. నిజాలను క్యాబినెట్ ముందు పెట్టకుండా, అక్రమాలకు అవకాశం ఇచ్చినందుకు ఆమెపై చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. నివేదిక అంతిమ నిర్ణయాన్ని కాకుండా, దాని రూపకల్పనకు అనుసరించిన విధానాన్ని స్మితా సభర్వాల్ సవాల్ చేశారు. ఆమె ప్రధానంగా రెండు అంశాలను ప్రస్తావించారు
1. వివరణకు అవకాశం ఇవ్వలేదు: కమిషన్ తన నివేదికలో తనపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినప్పటికీ, ఈ సిఫార్సులకు ముందు తనకు వివరణ ఇచ్చే అవకాశం ఇవ్వలేదని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వాదనలు వినకుండానే చర్యలకు సిఫారసు చేయడం చట్టవిరుద్ధమని ఆమె వాదించారు.
2. చట్టవిరుద్ధమైన సిఫార్సు: చర్యలు సిఫార్సు చేయడానికి అవసరమైన 8(బి) నోటీసు (చర్యలు తీసుకోవాలని సూచించే నోటీసు) 8(సి) విచారణకు అవకాశం కల్పించే నోటీసు తనకు ఇవ్వకుండానే, తనపై చర్యలు సిఫార్సు చేయడం చట్టవిరుద్ధం అని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రక్రియను ఆమె "అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్"గా అభివర్ణించారు.
స్మితా సభర్వాల్ తన పర్యటనలు, ఫీడ్‌బ్యాక్‌ల అంశాలను కమిషన్ "సెలెక్టివ్‌గా" (Selective) రిపోర్టులో పొందుపరిచిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు "చట్టపరంగానే" జారీ అయ్యాయని ఆమె స్పష్టం చేశారు. తనపై చర్యలు తీసుకోవాలనుకోవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని కూడా ఆమె తన వాదనలో పేర్కొన్నారు.
మధ్యంతర ఊరట
స్మితా సభర్వాల్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆమెకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఆమెపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. హైకోర్టు ఇప్పటికే కాళేశ్వరం అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి ఈ పిటిషన్‌ను కూడా విచారిస్తామని పేర్కొంది. స్మితా సభర్వాల్ తన పిటిషన్‌లో నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసినందున, ఆ నివేదికను కొట్టివేయాలని కోరారు.
సీబీఐ దర్యాప్తు స్థితి
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన లోపాలు, అక్రమాలపై సమగ్ర నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేసింది. సీబీఐ కూడా కాళేశ్వరం అంశంపై దృష్టి పెట్టింది. విచారణకు కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది.