Telangana News:తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (TGSWREIS) కార్యదర్శి డాక్టర్ విఎస్ అళగు వర్షిణి ఈ మధ్య చేసిన కామెంట్స్ చిక్కుల్లో పడేశాయి. గురుకుల విద్యార్థులపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్‌గా స్పందించింది. తెలంగాణ ప్రధాన కార్యదర్శి ,డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు ఆదివారం నోటీసులు జారీ చేసింది, 15 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
త్వరలోనే స్కూల్‌లు ప్రారంభంకానున్న వేళ ఈ మధ్య గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లపై వర్షిణి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విద్యార్థులను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ప్రతిపక్షాలు కూడా ఆ వ్యాఖ్యలను తప్పుపట్టారు. విద్యార్థులతో మరుగుదొడ్లు కడిగిస్తే తప్పేంటని ప్రశ్నించడం వివాదానికి కారణమైంది. ఇంట్లో వాళ్లు ఏ పనులు చేస్తారో హాస్టళ్లు, తరగతి గదుల్లో వాటిని చేయించాలని అన్నారు.
వారం రోజుల పది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీటిని విద్యార్థుల దినచర్యలో భాగం చేయాలని కూడా సూచించారు. వీటిని ఎవరైనా వ్యతిరేకిస్తే వారికి నోటీసులు కూడా ఇవ్వాలని సలహా ఇచ్చారు. వర్షణి కామెంట్స్ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ప్రతిపక్షాలు సీరియస్‌గా స్పందించాయి. ఆమెపై చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్ నేతలు డిమాండ్ చేశారు.
గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు టాయిలెట్లు శుభ్రం చేసుకోవడం, వారి గదులను తామే శుభ్రంగా ఉంచుకోవడం అనడం ఏంటని భారత రాష్ట్ర సమితి (BRS) నాయకుడు, TGSWREIS మాజీ కార్యదర్శి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి పిల్లలు చదువుతున్న పాఠశాలలోని బాత్రూమ్‌లు కడుగుతారా అని ప్రశ్నించారు. ఇలాంటి అవమనకరమైన కామెంట్స్ చేసిన వర్షణిని తొలగించాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని అన్నారు. “ఐఏఎస్ అధికారిణి డాక్టర్ అలుగు వర్షిణి ఆదేశాలు పూర్తిగా దారుణమైనవి. బ్యూరోక్రసీలో చాలా మంది మనువాద మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. అటువంటి ఆదేశాలను ప్రశ్నించే తల్లిదండ్రులను కూడా బెదిరిస్తున్నారని ఆయన Xలో ఘాటుగా స్పందించారు.
ఇవాళ మరోసారి రియాక్ట్ అయిన ప్రవీణ్ కుమార్
వర్షిణి వ్యాఖ్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ రియాక్ట్ అవ్వడంపై కూడా బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఇలాంటి సంపూర్ణ విద్యా ప్రయోగా ంమీరు చెప్పే ఆ ఉన్నత వర్గాల నుంచి ప్రారంభంకావాలని డిమాండ్ చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..."సంపూర్ణ విద్య ప్రయోగం అనేది ఉన్నత వర్గాల నుంచి వారి పిల్లలు చదివే ఇంటర్‌నేషనల్ స్కూల్స్ నుంచి ప్రారంభంకావాలని పేద పిల్లల నుంచి కాదు. (రిఫరెన్స్: తెలంగాణ, సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఆడియో సూచనలు)
అణచివేత వర్గాల/కుటుంబాల పిల్లలకు వేరే ఉన్నత వర్గాల నుంచి సాయం కానీ వారి భారాన్ని పంచుకునే చేతులు లేకపోవడంతో తమ వర్గానికి తామే సహాయం చేసుకోవడం అలవాటు చేసుకున్నారు. అది తప్పితే వారికి వేరే మార్గం లేదు.
మా బంధువులు, తాతామామలందరూ ఈ చాకిరీ చేయడం నేను చూశాను. ఎందుకంటే మేము మాదిగ (SC) సమాజానికి చెందినవారం. కాబట్టి మాకు సహాయం చేయడానికి ఎవరూ మా ఇళ్లకు రాలేదు! ఒకసారి మా ఇళ్లకు రండి, వారు ఎంత శుభ్రంగా ఉంటారో మేము చూపిస్తాము.
పేద పిల్లల ఆకాంక్షలను పదే పదే ఈ దోపిడీ వ్యవస్థ విస్మరిస్తూ వస్తోంది. స్వయం సహాయం పేరుతో,'పరిమిత' బడ్జెట్ల కారణంతో వారిని రోజువారీ పనులకే పరిమితం చేస్తోంది. ట్రినిటీ కాలేజ్ మీకు, టాయిలెట్లు మాకా???
ముఖ్యమంత్రి , ఆయన కార్యదర్శులు తమ పిల్లలను, మనవరాళ్లను పేద పిల్లలతోపాటు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ఒక నెల పాటు ఉంచి, ముందుగా ఈ స్వయం సహాయక పనులు చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను.
మీరు మీ తరగతి గది, బ్లాక్‌బోర్డ్ శుభ్రం చేయడం వంటి సమగ్ర విద్యను అభ్యసిస్తే, మీరు ప్రతిరోజూ ఒక గంట ముందుగానే మీ కార్యాలయానికి వచ్చి బాత్రూమ్‌లు, టేబుల్‌లు, కుర్చీలు మీరే శుభ్రం చేసుకోవాలి.
మీ ప్రధానోపాధ్యాయులు, అన్ని వర్గాల ఉపాధ్యాయులు కూడా సమగ్ర విద్యను అందించాల్సిన విధంగానే శుభ్రపరచడం, వంట చేయనివ్వండి. అప్పుడు పిల్లలు మీ అందరి నుంచి నేర్చుకుంటారు. సమగ్ర విద్యలో గుర్రపు స్వారీ, విహారయాత్రలు, ఆటలు, క్రీడలు, అంతర్జాతీయ గుర్తింపు, మీ ఇళ్ళు, కార్యాలయాలను సందర్శించడం మొదలైనవి కూడా ఉన్నాయని తెలుసుకోండి.
పేదలకు ఉపదేశించడం చాలా సులభం, ఎందుకంటే వాళ్లకు వేరే మార్గం లేదు కాబట్టి వాళ్లు ప్రశ్నించలేరు. అని ఘాటుగా సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. అంతే కాకుండా ఆ పోస్టును రాహుల్ గాంధీకి, ఖర్గేకు, రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేశారు. ఇంత తిరోగమన, రాతియుగ మనువాద మనస్తత్వం ఉన్న అధికారుల వెనుక ఉండటం పూర్తిగా అవమానకరమైన విషయం అని సిగ్గుచేటని ముగించారు.
ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
మీటింగ్‌లో వర్షిణి చేసిన కామెంట్స్‌ను షేర్ చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత... “సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీలో ఒక అధికారి ప్రవర్తన కాంగ్రెస్ ప్రభుత్వ పేద వ్యతిరేక వైఖరి ప్రతిబింబిస్తుంది” అని అన్నారు. శుభ్రపరిచే పనుల కోసం BRS పాలనలో సాంఘిక సంక్షేమ పాఠశాలలకు నెలకు రూ.40,000 చొప్పున ఇచ్చి నలుగురు తాత్కాలిక కార్మికులను నియమించుకున్నారని, ఈ సంవత్సరం మే నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నిలిపివేసిందని ఆమె ఆరోపించారు.
వీటితోపాటు "240 పాఠశాలల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను కూడా ప్రభుత్వం తొలగించింది, దీనివల్ల విద్యార్థులు వార్డెన్ల పాత్ర పోషించి వంటశాలలను నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అధికారి పిల్లలను పాఠశాలల్లో టాయిలెట్లు శుభ్రం చేయమని బలవంతం చేస్తున్నారు!!" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.