HYDRA Commissioner Ranganath On High Court: తెలంగాణలో ఎప్పుడూ చర్చలకు కేంద్రంగా మారుతున్న హైడ్రాపై హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. హైడ్రా కమిషనర్‌ను పదవి నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏం జరుగబోతోందా అన్న ఆసక్తి నెలకొంది. అయితే తనను తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. "నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1.50 లక్షల కోట్లు. ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఈ రెండు సంవత్సరాల లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది హైడ్రా. నిజం వైపు నిజాయితీగా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్ట్‌లను తప్పుదోవ పట్టిస్తున్నారు." అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
లోతుకుంట భూమి విషయంలో ఏం జరిగిందో రంగనాథ్ వివరించారు. "లోతుకుంట భూమి విషయంలో దాదాపు పది వేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా విధ్వంసం చేసింది. Save the Rocks Society, పర్యావరణవేత్తలతోపాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగంలో కి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉందని చెబుతూ లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేశారు. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. వాటిని వేసింది బడా భూ కబ్జాదారులే. బతుకమ్మకుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్‌లు కట్టాలని చూస్తున్నారు సంధ్యా శ్రీధర్‌రావు."అని ఆరోపణలు చేశారు.
వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్‌ను కొట్టేయాలని నల్ల మల్లారెడ్డి చూశారని రంగనాథ్ చెప్పుకొచ్చారు. "క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ రూ.వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్‌గా అడ్డు పడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు. వాటిని నేను చట్టపరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. చట్టాల పట్ల గౌరవంతో పని చేస్తూ వస్తున్నాను. గతంలో, ఇప్పుడు, భవిష్యత్‌లో ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100% ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా ఉంటాను. అలాగే పని చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పని చేస్తాను." అని స్పష్టం చేశారు.
