హోలీ వేడుకలపై హైదరాబాద్‌లో నగర పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధాని పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 వరకూ మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. 


బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై అనుమతి లేదని.. సంబంధం లేని వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయద్దని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


హోలీ పేరుతో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందుకే 48 గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 


హోలీ సందర్భంగా వాహనాలపై రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరగొద్దని... పోకిరీ వేషాలు వేస్తే చర్యలు తప్పవంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ ఆంక్షలు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉంటాయన్నారు. 


రెండు రోజుల పాటు మందుషాపులు బంద్‌ అవుతున్నాయని తెలిసిన వెంటనే హైదరాబాద్ వాసులు లిక్కర్‌ కోసం క్యూ కట్టారు. వైన్‌షాపులు, బార్ల ముందు బార్లు తీరారు. దీంతో లిక్కర్ షాపులన్నీ మందుబాబులతో కిటకిటలాడిపోయాయి.