బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 28 నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు సంబంధించి ఆడియో పాటలను విడుదల చేశారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ పాదయాత్ర పాటల సాహిత్యం చాలా అద్బుతంగా ఉందని అన్నారు. ‘‘భావోద్వేగపూరితంగా పాటలు ఉన్నాయి. గుండెను హత్తుకునేలా ఉన్నాయి. తెలంగాణ మారుమూల ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవడం ఖాయం. ఇలాంటి పాటలు రాసిన వారందరికీ నా అభినందనలు. బండి సంజయ్ చేపట్టనున్న పాదయాత్ర విజయవంతం అవుతుందనే సంపూర్ణ నమ్మకం నాకుంది. ఈ యాత్రలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరుతున్నా. ఏడేళ్ల కేసీఆర్ పాలనంతా దోపిడీ మయం. నియంత పాలనతో ప్రజలు బాధపడుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ మాత్రమే టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం.’’


‘‘దురదృష్టవశాత్తు మీడియా పూర్తిగా కేసీఆర్ నియంత్రణలోనే ఉంది. జర్నలిస్టులు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. తెలంగాణ అంతా కేసీఆర్ కుటంబం చేతిలోకి వెళ్లిపోయింది. నా రాష్ట్రం, నా ఇష్టం అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. ఎదిరిస్తే జైలుకు పంపుతున్నారు. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలి’’


‘‘హుజూరాబాద్‌లో జరిగే ఉప ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపు ఖాయం. కేసీఆర్ మైండ్ బ్లాంక్ కావడం ఖాయం. ఇప్పటికే కేసీఆర్ దళిత బందు, రకరకాల స్కీంలతో ఎన్ని మాయలు చేసినా ఏవీ ఈ సారి పనిచేయవు. బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరు’’అని విజయశాంతి తేల్చి చెప్పారు.


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ ‘‘రాష్ట్ర ప్రజలంతా ప్రజా సంగ్రామ యాత్ర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది మహా సంగ్రామ యాత్రగా మారబోతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత, అవినీతి పాలనను ఈ యాత్ర ద్వారా ప్రజల్లో ఎండగట్టబోతున్నాం. కేసీఆర్ ఇకనైనా రాజకీయ కుళ్లు బుద్ధిని మానుకోవాలి. అట్టహాసంగా కార్యక్రమాలను అమలు చేస్తున్నా ఆచరణలో మాత్రం గుండు సున్నాగా మారుతోంది. పేదల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు, ఉత్తర్వులను సైతం తెలంగాణలో అమలు చేయడం లేదు. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లను అమలు చేస్తూ కేంద్రం తెచ్చిన జీవోను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నా తెలంగాణలో మాత్రం అమలు కాకపోవడం బాధాకరం.’’


‘‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పశ్చిమబెంగాల్, ఒడిశా సహా దేశవ్యాప్తంగా పేదలకు ఇండ్లు నిర్మిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ పథకాన్ని పూర్తిగా నీరుగార్చింది. కేసీఆర్ రాజకీయ కుళ్లు బుద్ది వల్లే వారంతా నష్టపోయారు. పేదల ఉసురు రాష్ట్ర ప్రభుత్వానికి తగలకమానదు’’ అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత విజయశాంతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, పాదయాత్ర కమిటీ ప్రముఖులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, అధికార ప్రతినిధి ఎ.రాకేష్ రెడ్డి తదితరులు ఈ ఆడియో పాటల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు.