హైదరాబాద్ శివార్లలోని సుచిత్ర - కొంపల్లి వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి బాగా కురవడంతో కొంపల్లి - దూలపల్లి మార్గంలో రోడ్డు కోతకుగురైంది. దీంతో వాహనాలు రెండు వైపులా నిలిచిపోయాయి. మేడ్చల్ వైపు వెళ్లే వాహనాలు సుచిత్ర వద్దే ఆగిపోతున్నాయి. ఫలితంగా భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను మరోదారిలో మళ్లిస్తున్నారు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచంపల్లి చెరువు నిండిపోయింది. చెరువు అలుగు పోస్తుండటంలో రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుంది.
కుత్బుల్లాపూర్ నిన్న రాత్రి దంచికొట్టిన వర్షానికి కొంపల్లి మున్సిపల్ పరిధి కొంపల్లి నుండి దూలపల్లి వచ్చే ప్రధాన రహదారి ప్రస్తుత పరిస్థితి అధ్వానంగా ఉంది. రోడ్డు తెగిపోయి ఆ మార్గం మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో వాహనదారులు రాకపోకలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్లమేర రహదారి ట్రాఫిక్ జామ్ అయింది.
రాత్రి కురిసిన వర్షానికి గుండ్లపోచం పల్లి చెరువు నిండిపోయింది. చెరువు అలుగుపోస్తుండటంలో రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తుంది. శామీర్‌పేట మండలంలోని తూంకుంటలో భారీ వర్షానికి ఓ ప్రైవేటు పాఠశాల నీట మునిగింది. తరగతి గదుల్లో వర్షపు నీరు ప్రవేశించింది. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో బుధవారం రాత్రి 10 గంటలకు ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి 12.30 గంటల వరకు ఎడతెరపి లేకుండా పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
వరదలో కొట్టుకుపోయిన వాహనాలు
హైదరాబాద్‌లో బుధవారం రాత్రి వాన దంచికొట్టిన సంగతి తెలిసిందే. రాత్రి 7.30 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు కుండపోతగా వర్షం పడింది. దీంతో చాలా ప్రాంతాల్లో కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, చార్మినార్, సికింద్రాబాద్, ఎల్‌బీ నగర్ జోన్లలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కూకట్ పల్లిలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, కుత్బుల్లాపూర్‌లో 9.2 సెంటీమీటర్లు, తిరుమలగిరిలో 9 సెంటీమీటర్లు, రామచంద్రాపురం 8.2 సెంటీమీటర్లు, మూసాపేట్ 8 సెంటీమీటర్లు, ఫతేనగర్‌లో 7.3 సెంటీమీటర్లు, పటాన్‌చెరు 7.2 సెంటీమీటర్లు, బాలానగర్ 6.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది.
ముఖ్యంగా బొరబండలోని కాలనీల్లో వరద పోటెత్తింది. ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ కింద భారీగా వరద నీరు నిలిచింది. దీంతో రెండు వైపుల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఖైరతాబాద్, అమీర్ పేట్, ఎల్లారెడ్డి గూడ రోడ్డు జంక్షన్, బేగంపేట్, కుత్బుల్లాపూర్, ఆల్వాల్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సనత్‌గర్, ఎస్ఆర్‌నగర్, వెస్ట్ వెంకటాపురం, రామచంద్రాపురం రోడ్లపై భారీగా ప్రవహించింది.