హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కార్డియాక్ అరెస్ట్ కు గురైన ఓ వ్యక్తి ప్రాణాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ కాపాడారు. నడిరోడ్డుపైనే ఆ వ్యక్తికి కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి బస్సు దిగిన బాలాజీ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి బాలాజీ అనే వ్యక్తి ఆరంఘర్ వైపు ప్రయాణిస్తున్నాడు. ఆరంఘర్ చౌరస్తాలో దిగగానే బాలాజీ గుండెపోటుతో కుప్పకూలాడు. అతణ్ని గమనించి ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే సీపీఆర్ చేశారు. ఛాతీపై గట్టిగా పదే పదే ప్రెస్ చేసి బాలాజీ ప్రాణాన్ని రాజశేఖర్ కాపాడారు. అనంతరం బాలాజీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


నిన్న ఒక్కరోజే హైదరాబాద్ నాలుగు కార్డియాక్ అరెస్ట్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. నిన్న (ఫిబ్రవరి 23) పాత బస్తీలో ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కుమారుణ్ని ముస్తాబు చేస్తున్న వ్యక్తి కుప్పకూలిపోయాడు. కాలాపత్తార్‌లో మహమ్మద్ రబ్బాని అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇటీవల తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో బంధువులంతా ఉత్సాహంగా పాల్గొని వరుడిని ముస్తాబు చేస్తున్నారు. ఇంతలో మహమ్మద్ రబ్బాని పెళ్లి కొడుకు వద్దకు వచ్చి.. అతడి పాదాలకు పసుపు రాస్తుండగా ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన బంధువులు అయన్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆయన చనిపోయారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు ధ్రువీకరించారు. 


రబ్బాని మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మహమ్మద్ రబ్బాని వరుడి పాదాలకు పసుపు రాస్తూ కుప్పకూలిన దృశ్యాలను బంధువులు ఫొన్‌లో వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీటిని చూసిన వారు భయానికి గురవుతున్నారు.


జిమ్ లో యువ కానిస్టేబుల్


జిమ్‌లో కసరత్తులు చేస్తూ 24 ఏళ్ల యువ పోలీస్‌ కానిస్టేబుల్ కార్డియాక్ అరెస్ట్ తో అక్కడికక్కడే కుప్పకూలాడు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అతడు చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. బోయిన్‌పల్లికి చెందిన ఈ కానిస్టేబుల్ పేరు విశాల్. 2020 బ్యాచ్‌ కానిస్టేబుల్స్ శిక్షణలో పాల్గొన్నాడు. ఆసిఫ్‌ నగర్ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. చదువు పూర్తయిన వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడిన ఈ యువకుడు 24 ఏళ్లకే ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులను తీవ్రమైన విషాదంలో ముంచింది.


ఇతను జిమ్‌కు వెళ్లగానే వార్మ్‌అప్ చేసే సమయంలో ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించి పుష్ అప్స్ పూర్తి చేశాక కిందికి వంగి స్ట్రెచెస్‌ చేస్తుండగా నేలపై కూలిపోయాడు. తోటి వారు గమనించి అతణ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే చనిపోయాడు.