ఈజిప్టులో నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన కాప్ 27 సదస్సులో పాల్గొని మాట్లాడే అరుదైన అవకాశం ఓ భారతీయ విద్యార్థికి, అందులోనూ హైదరాబాద్ టీనేజర్‌కి లభించింది. ఈ కాప్ 27 సదస్సుకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా ఎంతో మంది దేశాధినేతలు హాజరు కానున్నారు. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ సమ్మిట్ దీన్ని నిర్వహిస్తోంది. ఈజిప్ట్ లోని షర్మ ఎల్ షేక్ సిటీలో నవంబరు 6 నుంచి 18వ తేదీ వరకూ సదస్సు జరగనుంది. ఇందులో 200 దేశాలకు చెందిన 35 వేల మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తలు తదితరులు పాల్గొననున్నారు. పర్యావరణ పరిరక్షణ దిశగా చేసిన తీర్మానాలు, వాటి అమలు తీరును రివ్యూ చేసి, ప్రపంచానికి కొత్త దిశ చూపించనున్నారు.
ఇంతటి ప్రాముఖ్యం ఉన్న సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ కు చెందిన అంకిత్ సుహాస్ రావు అనే టీనేజర్‌కు అవకాశం దొరికింది. ఇతను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్నాడు. ఆ స్కూల్‌లో తరచూ నిర్వహించే క్లైమేట్ అవేర్ నెస్ కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. ఇప్పటిదాకా తాను నేర్చుకున్నది, పర్యవేక్షించిన సమాచారాన్ని అంకిత్ కాప్ 27 సదస్సులో ప్రెసెంట్ చేయనున్నాడు.
16 ఏళ్ల అంకిత్‌కు క్లైమేట్ సైంటిస్ట్ అవ్వాలనేది కల. ‘‘వాతావరణ మార్పు జరుగుతోందని, ఇది చాలా వేగంగా జరుగుతోందని ప్రజలకు తెలియచెప్పడానికి నేను దానిని ఎంచుకున్నాను.’’ అని అంకిత్ తెలిపాడు.
గ్లోబల్ క్లైమేట్ ఛేంజ్ కాన్ఫెరెన్స్‌లో పాల్గొనే అవకాశం అంకిత్ లాంటి వ్యక్తికి రావడం ఇదేం తొలిసారి కాదు. 2021లో పవన్ త్రిషు కుమార్ అనే విద్యార్థికి స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్ 26 సదస్సులో అవకాశం దక్కింది.
ఈ సదస్సు ఎవరు నిర్వహిస్తారు? ఎందుకు?
వాతావరణ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు ఎక్కువగా వస్తున్నాయి. వీటిని అరికట్టడానికి, పర్యావరణ మార్పులపై కార్యాచరణ రూపొందించటానికి 'యునైటెన్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆఫ్ క్లైమేట్ ఛేంజ్ (యుఎన్‌ఎఫ్‌సీసీసీ)' పేరుతో ఐక్యరాజ్య సమితి ఓ వేదికను ఏర్పాటుచేసింది. ఇందులో భాగస్వామ్యమైన సుమారు 200 దేశాల వార్షిక సమావేశాన్ని కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (కాప్)గా పిలుస్తారు. ఇలా తొట్టతొలి సదస్సు 1995లో బెర్లిన్‌లో జరగ్గా, గత ఏడాది కాప్-26 సదస్సు స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో నిర్వహించారు.
ఇప్పుడున్న ఉష్ణోగ్రతలు ఎట్టిపరిస్థితుల్లోనూ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ మేర పెరగరాదని, అదే జరిగితే సగం మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ అంశంపై కాప్‌లో చర్చించి, ఉష్ణోగ్రతల కట్టడికి ప్రపంచవ్యాప్త కార్యాచరణ రూపొందిస్తారు.
బొగ్గుపై ఆధారపడ్డ పరిశ్రమల విషయంలో వాటిని ఇప్పటికిప్పుడు ఆపేయడం కష్టం. అలాంటి దేశాలకు సంపన్న దేశాలు ఆర్థికంగా, సాంకేతికంగా సాయం చేసేలా, ప్రత్యామ్నాయ మార్గాల దిశగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈజిప్టులో జరుగుతున్న సదస్సులో అభివృద్ధి చెందిన దేశాలు చేసే ఆర్థిక సాయంపై తీర్మానాలే కీలకంగా చర్చిస్తారు. గతంలో విచ్చలవిడిగా పర్యావరణాన్ని దెబ్బతీసిన అమెరికా, ఐరోపా వంటి సంపన్న దేశాలు.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం చేయాలని భారత్, బ్రెజిల్ తదితర దేశాలు డిమాండ్ చేస్తున్నాయి.