హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య ఇంకా తీరలేదు. బాలుడిపై కుక్క దాడి చేసిన ఘటన తాజాగా మరొకటి జరిగింది. గతంలో ఎన్నో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ తాజాగా మళ్లీ అలాంటి సమస్యే ఎదురు కావడం పట్ల నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ ​లోని పాతబస్తీలో సంతోశ్​ ​నగర్ కాలనీలో కుక్క దాడిలో ఓ బాలుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. వీధి కుక్కల దాడి దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


పాతబస్తీలోని సంతోశ్​ ​నగర్ కాలనీలో ఇంటి ముందు నిలబడి ఉన్న ఐదేళ్ల బాలుడు అబ్దుల్ రఫీపై వీధి కుక్క దాడి చేసింది. బాలుడు కుక్కను చూసి లోనికి వెళ్లిపోతుండగా, అది వేగంగా వచ్చి బాలుడ్ని పట్టేసింది. గమనించిన స్థానికులు కుక్కను తరిమి వేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు హుటాహుటిన బాలుడిని నారాయణగూడ ఆస్పత్రికి తరలించారు. వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వీధి కుక్కల నియంత్రణకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.