Reusable Rocket Engine: భారత అంతరిక్ష పరిశోధన రంగంలో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. నగరానికి చెందిన అబ్యోమ్ స్పేస్ టెక్ అండ్ డిఫెన్స్ స్టార్టప్, దేశంలోనే తొలి పూర్తి స్థాయి స్వదేశీ పునర్వినియోగ లిక్విడ్ రాకెట్ ఇంజిన్ క్వాలిఫికేషన్ టెస్ట్ క్యాంపెయిన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. మే 27 బుధవారం నాడు మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాలోని శామీర్‌పేటలో ఉన్న కంపెనీకి చెందిన కమర్షియల్ టెస్ట్ ఫెసిలిటీ వద్ద ఈ పరీక్షలు జరిగాయి.
సాధారణంగా రాకెట్ ఇంజిన్లను ఒకసారి వాడిన తర్వాత అవి పనికిరాకుండా పోతాయి. కానీ, అబ్యోమ్ స్పేస్ టెక్ అభివృద్ధి చేసిన ఈ ఇంజిన్ మళ్లీ మళ్లీ వాడుకోవడానికి వీలుగా రూపొందించారు. ఈ స్టార్టప్ తన సొంత సాంకేతికతతో, ఎవరి సాయం లేకుండా ఫ్లైట్ రెడీ క్రయోజెనిక్ ఇంజిన్, హోప్ వీటీవీఎల్ పునర్వినియోగ రాకెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ మైలురాయిని అధిగమించింది.
పునర్వినియోగ రాకెట్ల వల్ల అంతరిక్ష ప్రయోగాల వ్యయం భారీగా తగ్గుతుంది. ఇంజిన్ సిస్టమ్స్, కంట్రోల్ ఆర్కిటెక్చెర్, డేటా సేకరణ వ్యవస్థలు ఇలా అన్నీ మన దేశంలోనే, అబ్యోమ్ శాస్త్రవేత్తల చేతుల్లోనే రూపొందాయి. విదేశీ సాంకేతికతపై ఆధారపడాల్సిన అవసరం తప్పింది. ఇది కేవలం పౌర అవసరాలకే కాకుండా రక్షణ రంగంలో కూడా వ్యూహాత్మక ప్రయోజనాలను అందిస్తుంది.
బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్‌లోని టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్‌లో ఈ స్టార్టప్ రూపుదిద్దుకుంది. కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో జైనల్ అబిదీన్ తెలిపిన వివరాల ప్రకారం ఇది కేవలం ఒక ఇంజిన్ పరీక్ష మాత్రమే కాదని, భారత్‌లో స్వదేశీ పునర్వినియోగ ప్రొపల్షన్ వ్యవస్థ నిర్మాణానికి ఇది బలమైన పునాది అని అన్నారు.
