Hyderabad News: హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అరబిందో ఫార్మా కంపెనీ లో ప్రమాదం జరిగింది. యూనిట్ 2లో ఈ రోజు సాల్వెంట్ గ్యాస్ లీకైoది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు శ్వాస ఆడక ఇబ్బందులు పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వీరిని స్థానిక ఎస్ఎల్‌జీ ఆసుపత్రిలో చేర్పించారు. ఉదయం 9 గంటలకు ఈ ఘటన జరిగినట్లు సమాచారం. బాచుపల్లి పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై కంపెనీ యాజమాన్యంతో చర్చించారు. బాచుపల్లి అరబిందో ఫార్మా కంపెనీ లో గ్యాస్ లీకేజ్ ఘటనలో కె. శ్రీనివాస రావు, జె.గౌరీ, ఏ.విమల కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ముగ్గురు ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు గౌరీనాథ్, యాస్ మయ్య, ప్రేమ్ కుమార్, ప్రసాద్ రాజ్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.


గతేడాది జూన్ లో ఏపీలో విష వాయువులు విడుదల


ఏపీలోని అనకాపల్లిలో ఇటీవల మూడు రోజుల్లో రెండు పర్యాయాలు విష వాయులు లీకయ్యాయి. ఈ ఘటనపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చర్యలు చేపట్టింది. ఇటీవల గ్యాస్ లీకై సిబ్బంది అస్వస్థకు గురికాగా, విష వాయువులు లీకైన పోరస్ కంపెనీలో పనులు ఎక్కడికక్కడ నిలుపుదల చేయాలని పీసీబీ ఛైర్మన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి గ్యాస్ లీకైన కంపెనీ పోరస్ లాబోరేటరిస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి శాంపిల్స్ సేకరించింది. ఆ శాంపిల్స్‌ను పరిశీలన నిమిత్తం హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి పంపించింది పీసీబీ. తమ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కంపెనీ మూసివేయాలని, ఏ కార్యకలాపాలు చేపట్టవద్దని నోటీసులలో పేర్కొంది. ఇటీవల విష వాయువులు లీక్ కావడంతో 350 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారని పీసీబీ గుర్తుచేసింది.



శుక్రవారం తొలిసారి గ్యాస్ లీక్..


అచ్యుతాపురం బ్రాండిక్స్ సెజ్ లోని సీడ్స్‌ వస్త్ర పరిశ్రమ నుంచి శుక్రవారం విషవాయువు లీక్ అవ్వడంతో సుమారు 300 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకు కంపెనీ మూసివేయాలని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆదేశించారు. సెజ్ లోని సీడ్స్‌ కంపెనీ నుంచి గాఢమైన అమ్మోనియా విషవాయువు లీక్ అయింది. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన మహిళలు అనకాపల్లిలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా కోలుకుంటున్నారు. పురుషులు త్వరగా కోలుకుంటుండుగా, మహిళలు కాస్త ఆలస్యంగా తేరుకుంటున్నారని సమాచారం. బాధితులకు మరోసారి వైద్య పరీక్షలు చేసి డిశ్చార్జ్ చేయాలని వైద్యులకు కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చారు. 


నిపుణుల కమిటీ నివేదిక..


తొలుత రెండు రోజుల పాటు బ్రాండిక్స్ సెజ్‌లోని సీడ్స్ కంపెనీ మూసివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కంపెనీ మూసివేయడంతో జూన్ 7వ తేదీ నాడు విష వాయువులు లీకైనా ప్రమాదం తప్పిపోయింది. మూడు రోజుల్లో రెండోసారి గ్యాస్ లీక్ కావడంతో నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తరువాతే సీడ్స్ కంపెనీ తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా గ్యాక్ లీకేజీ కావడంతో స్థానికులు సైతం దీనిపై భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలోనైనా విష వాయువులు మరోసారి లీకైతే ప్రాణాపాయం పొంచి ఉంటుందని కార్మికులు, సిబ్బంది భావిస్తున్నారు.