తెలంగాణలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైందో లేదో ఇక అక్రమంగా డబ్బులు, విలువైన వస్తువుల రవాణా ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. షెడ్యూల్ విడుదల కాగానే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తున్నందున పోలీసులు కూడా దానిపై ఫోకస్ చేశారు. నాయకులు ఓటర్లకు పంచేందుకు డబ్బులు, గిఫ్టులు, విలువైన వస్తువులు తరలిస్తుండగా వాటిని పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నగదు, బంగారం, వెండిని ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన ఇతర తాయిలాలను స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. సరైన పత్రాలు లేకపోవడం వల్లే వీటిని స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు.


హైదరాబాద్‌ చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న భారీ బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 5.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు బైక్ లను కూడా సీజ్ చేశారు. బషీర్ బాగ్ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు 300 కేజీల వెండిని అబిడ్స్ పోలీసులు సీజ్ చేశారు. బంగారం 16 కేజీల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి విలువ రూ.10 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు.


శేరిలింగంపల్లి గోపన్‌పల్లి తండాలో ఓటర్లకు పంచడానికి రెడీగా ఉంచిన కాంగ్రెస్‌ నేత ఫొటోతో ఉన్న  87 రైస్‌ కుక్కర్లను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. 


ఎల్బీనగర్‌ పరిధిలోని వనస్థలిపురం ఆటోనగర్ వద్ద పోలీసులు చేసిన వాహనాల తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకొని సీజ్‌ చేశారు. షాద్‌ నగర్‌ పరిధిలో మూడు పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేయగా.. రాయికల్ టోల్ ప్లాజా వద్ద చేపట్టిన తనిఖీల్లో రూ 11.5 లక్షలు పట్టుబడ్డాయి. ఫిల్మ్‌ నగర్‌లో రూ.30 లక్షల నగదు పట్టుకున్నారు.