Ganesh Immersion: హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనాలు షురూ అయ్యాయి. ఈ నెల 7న వినాయక చవితి రోజున మండపాల్లో కొలువు దీరిన గణేష్ పూజలు అందుకుంటున్నాడు. మూడో రోజు నుంచి నగరంలో నిమజ్జనాలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. 5వ రోజైన బుధవారం వివిధ చెరువులు, రిజర్వాయర్లలో డీజే మేళతాళాలు, షేర్ బ్యాండ్ చప్పుళ్లతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ నెల 17న ఖైరతాబాద్ గణేశుడితో సహా మహా నిమజ్జనం జరగనుండగా.. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.


పోలీసుల కఠిన వైఖరి
ఇక గణేష్ నిమజ్జనాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గణేష్ విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనంలోకి మద్యం, మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తులను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి వారిని నిమజ్జనంలో కూడా అనుమతించబోమని చెప్పారు. మద్యం సేవించి ఇతరుల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని హైదరాబాద్‌ పోలీసులు నగర ప్రజలకు సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ట్రాఫిక్, శాంతిభద్రతలు, ఇతర పోలీసులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా నగరంలో మతపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రౌడీలు, వర్గ సమస్యలపై దృష్టి సారించాలని కింది స్థాయి అధికారులకు సీపీ సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. 
 
25వేల మందితో బందోబస్తు
నిమజ్జనం రోజు (సెప్టెంబర్ 17) 25 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని సీవీ ఆనంద్ తెలిపారు. 15 వేల మంది నగర పోలీసులు, 10 వేల మంది జిల్లాల నుంచి  పోలీసులు వస్తున్నారని తెలిపారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని హుస్సేన్ సాగర్ వైపు వచ్చే విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌ సాగర్‌ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటితో బేబీ పాండ్స్‌, పూల్ పాండ్స్‌ను జీహెచ్ ఎంసీ రెడీ చేసింది. 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ.. విగ్రహాలను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లు, వ్యర్థాలను తొలగించేందుకు భారీ వాహనాలను అధికారులు రెడీ చేశారు.


లక్ష విగ్రహాల నిమజ్జనం
హైదరాబాద్‌ లో ఈ ఏడాది లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉండటంతో.. హుస్సేన్‌ సాగర్‌తో పాటు జంటనగరాల పరిధిలోని జలాశయాల వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌వైపు మినహా ఎన్టీఆర్ మార్గ్‌, పీవీ మార్గ్‌లో ఇప్పటికే భారీ క్రేన్లను రెడీగా ఉంచారు. పీవీ మార్గ్‌లో నిమజ్జనాల సందడి గత మూడు రోజుల నుంచే కొనసాగుతోంది. ఇక చివరి రోజున భారీగా గణనాథులు సాగర తీరం వైపు తరలి రానున్నారు. మొత్తం ఆరు జోన్లలో ఐదు పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా 73 కుంటలను గణపతుల నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 12, ఛార్మినార్ జోన్‌లో 10, ఖైరతాబాద్ జోన్‌లో 13, శేరిలింగంపల్లి జోన్‌లో 13, కూకట్‌పల్లి జోన్‌లో 11, సికింద్రాబాద్ జోన్‌లో 12 తాత్కాలిక నిమజ్జన కుంటలను రెడీ చేశారు.


జీహెచ్‌ఎంసీ కమిషర్ ఆమ్రపాలి ఆదేశాలు
 శోభాయాత్ర నుంచి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చెట్ల కొమ్మల తొలగింపు పూర్తయిందని, రోడ్డు మరమ్మతులు, బారికేడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు, జీహెచ్ ఎంసీ, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 160 గణేష్ యాక్షన్ టీమ్‌లు, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు ఏర్పాటు చేశామని, భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో 308 మొబైల్ టాయిలెట్లను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా భక్తులు సహకరించాలని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు.