Missing Parrot: కుక్కలు, పిల్లులు, ఉడతలు, పక్షులు లాంటి పెంపుడు జంతువులను పెంచుకునే వారు చాలా మందే ఉంటారు. ఆయా పెంపుడు జంతువులను యజమానులు ఇంట్లో సభ్యుల్లాగే చూసుకుంటారు. వాటికి ఎన్నో సపర్యలు చేస్తుంటారు. అన్నీ సమయానికి సమకూరుస్తారు. వాటితో వాకింగ్ చేస్తారు, కలిసి ఆటలాడుకుంటారు, ఒకే మంచంపై పడుకుంటారు, ఒకే కంచంలో తింటారు కూడా. అంతగా పెంపుడు జంతువులతో ప్రేమానురాగాలను పంచుకుంటారు. అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు. కొందరైతే ఈ పెంపుడు జంతువుల కోసం లక్షల్లో ఖర్చు చేస్తుంటారు. లక్షలు పెట్టి కొని తెచ్చుకుని, వాటిని పెంచడానికి అంతే మొత్తంలో ఖర్చు కూడా చేస్తుంటారు.


అంత ప్రేమతో పెంచుకునే జంతువులు, పక్షులు ఒక్క క్షణం కనిపించకపోయినా విలవిల్లాడిపోతారు. పెంపుడు జంతువులు తప్పిపోతే తల్లడిల్లిపోతుంటారు. వాటి కోసం పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కుతుంటారు. తప్పిపోయిన పెట్ కోసం తీవ్రంగా గాలిస్తుంటారు. మిస్సింగ్ అని బోర్డులు అంటించడం, సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టు చేయడం, వెతికి తెచ్చిన వారికి నజరానా ప్రకటించడం లాంటివి చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ లో ఓ వ్యక్తి తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న చిలుకను పోగొట్టుకున్నాడు. పంజరంలో నుంచి ఎగిరిపోయిన చిలుకను వెతికిపెట్టాలని పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ చిలుకను వెతికి వెనక్కి తీసుకొచ్చి యజమానికి అప్పగించారు.


హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 44లో నివసించే, మైరు బిస్ట్రో కాఫీ షాప్ యజమాని నరేంద్ర చారీ ఓ చిలుకను పెంచుకుంటున్నారు. ఆ చిలుక ఆస్ట్రేలియా జాతికి చెందిన గాలా కాక్టో. 4 నెలల వయస్సున్న ఆ చిలుకను నరేంద్ర చారీ ఏకంగా రూ.1.30 లక్షలకు కొనుగోలు చేశారు. తన నివాసం వద్దే పంజరం ఏర్పాటు చేసి చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నారు. సెప్టెంబర్ 22వ తేదీన పంచరం తెరిచి దానికి ఆహారం పెట్టే సమయంలో అది కాస్త పంజరం నుంచి ఎగిరిపోయింది. 


చుట్టుపక్కల గాలించినా ఫలితం లేదు. ఎగిరిపోయిన చిలుక దానంతట అదే తిరిగి వస్తుందని రెండు రోజులు వేచి చూశారు. చిలుక ఎంతకీ తిరిగి రాకపోవడంతో 24వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఫోటోను పోలీసులకు అందించారు. జూబ్లీహిల్స్ ఎస్సై ఫోటోను స్థానికంగా పక్షులు, జంతువులను విక్రయించే దుకాణాలకు సమాచారం పంపారు. 


చిలుక ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని విక్రయ దుకాణాదారులకు పోలీసులు ఫోటోలు పంపించారు. జూబ్లీహిల్స్ లో తప్పించుకున్న చిలుకను ఎర్రగడ్డలో రూ. 30 వేలకు ఓ వ్యక్తి అమ్మేశాడు. కొనుగోలు చేసిన వ్యక్తి దానిని మరుసటి రోజు రూ. 50 వేలకు సయ్యద్ ముజాహిద్ కు విక్రయించాడు. కొనుగోలు చేసిన చిలుకను రూ. 70 వేలకు అమ్ముతానని ముజాహిద్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టాడు. అది కాస్త ఓ పెట్ షాప్ నిర్వాహకుడు చూసి జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం అందించాడు. 25వ తేదీన సయ్యద్ ముజాహిద్ నుంచి ఆ అరుదైన జాతి చిలుకను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ చిలుకను నరేంద్ర చారీకి అప్పగించారు.