Konda Surekha OSD : తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారుతోంది కొండా సురేఖ ఓఎస్‌డీ సమంత్ ఎపిసోడ్. ఆయన్ని అరెస్టు చేయడానికి వచ్చారని కొండా సురేఖ కుమార్తె సుస్మిత పోలీసులతో వాగ్వాదనికి దిగడం, తర్వాత రచ్చ జరగడం తెలిసిందే. ఇదంతా టార్గెటెడ్‌గా చేస్తున్నారని కొండా ఫ్యామిలీ ఆరోపించడంతో పోలీసులు రియాక్ట్ అయ్యారు. అసలు ఆ టైంలో అక్కడకి ఎందుకు వెళ్లారో వివరించారు.
కొండా సురేఖ ఓఎస్‌డీగా ఉన్న సుమంత్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఆయన్ని ప్రభుత్వం అందుకే తప్పించదని పేర్కొన్నారు. వాటిపై క్లారిటీ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. మూడు నాలుగు రోజుల నుంచి సుమంత్‌ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయినా టచ్‌లోకి రాకపోవడంతో రంగంలోకి దిగాల్సి వచ్చిందన్నారు. ఆయన కొండా సురేఖ ఇంట్లో ఉన్నారనే సమాచారం తెలుసుకున్న తర్వాతే అక్కడకు వెళ్లినట్టు వెల్లడించారు. ఇంత వరకు సుమంత్‌పై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కానీ ఆరోపణలు చాలానే ఉన్నాయని అన్నారు. అందుకే వాటిపై స్పష్టత తీసుకునేందుకు పర్శనల్‌గా మాట్లేందుకు వెళ్లామన్నారు.
రాత్రి మంత్రి కొండా సురేఖ ఇంటికి పోలీసులు సివిల్ డ్రెస్‌లో వెళ్లారు. ఓఎస్‌డీ సుమంత్ గురించి ఆరా తీశారు. ఆయన్ని తీసుకెళ్లాలని చెప్పారు. ఎందుకు తీసుకెళ్లాలని ఆయన చేసిన తప్పేంటని, కేసు వివరాలు చెప్పాలని కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారికి ఎదురు ప్రశ్నించారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా సుమంత్‌ను ఎలా పంపిస్తామని నిలదీశారు. ఉన్నతాధికారులతో మాట్లాడించాలని సూచించారు. దీంతో మంత్రి ఇంటి వద్ద హైడ్రామా నడిచింది.
దీని గురించి తెలుసుకున్న వెళ్లిన మీడియాతో మాట్లాడిన సుస్మిత ప్రభుత్వ పెద్దలపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొండా ఫ్యామిలీని టార్గెట్ చేశారని కావాలని కుట్ర చేస్తున్నారని అన్నారు. తన తల్లిని మంత్రి పదవి నుంచి తప్పించి వేధించాలని చూస్తున్నారని విమర్శించారు. ఇందులో ముఖ్యమంత్రి కూడా భాగమై ఉన్నారని, తన తండ్రిని అరెస్టు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.
ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు జోక్యం చేసుకున్నారనే విషయంపై కూడా సుస్మిత స్పందించారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో మాట్లాడితే అసలు తాను ఎలాంటి ఫిర్యాదు చేయలేదని చెప్పారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి సహా ఒకరిద్దరు మంత్రులు తమను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. రెడ్లు ఒక్కటై బీసీలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తమను టార్గెట్ చేస్తూ క్రమంగా సెక్యూరిటీ తొలగిస్తున్నారని అన్నారు.
ఇప్పుడు ఈ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. తరచూ మంత్రుల మధ్య వివాదాలు, ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతోంది.ఇప్పుడు ఈ ఇష్యూపై పార్టీ,ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి నెలకొంది.