Attack on Journalists: హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడి చేస్తున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే టీవీ9 రిపోర్టర్‌ను బలవంతంగా జీపు ఎక్కించబోయిన పోలీసులు.. తాజాగా ఓయూలో అలాంటి తప్పిదమే చేశారు. ఓయూలో కవరేజ్ కోసం వెళ్లిన జీ తెలుగు రిపోర్టర్‌ను చొక్కా పట్టుకొని లాక్కెళ్లి పోలీసులు వాహనం ఎక్కించారు. డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఓయూలో నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఘటనలను కవర్ చేసేందుకు అక్కడ వివిధ వార్తా సంస్థలకు చెందిన విలేకరులు ఉన్నారు. ఇంతలో పోలీసులు నిరసన కారులు అనుకొని మీడియా ప్రతినిధులపై కూడా దౌర్జన్యం ప్రదర్శించారు. తాను విధుల్లో ఉన్న మీడియా ప్రతినిధిని అని చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా పోలీసులు అతణ్ని బలవంతంగా జీపు ఎక్కించారు.
అయితే, పోలీసులు జర్నలిస్టులపై దాడి చేస్తుండడాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ‘‘ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని హరీశ్ రావు ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఎమర్జెన్సీని తలపిస్తున్న ప్రజాపాలన - బీఆర్ఎస్
‘‘నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థులు ధర్నా చేస్తుంటే.. చిత్రీకరించడానికి వెళ్ళిన జర్నలిస్టులను తిడుతూ, లాక్కుని వెళ్ళి మరీ అరెస్టులు చేయిస్తున్నారు.. గుంపు మేస్త్రి. నాడు.. "ఛానళ్ళు ఉన్నాయి కదా అని లోఫర్ గాళ్ళు వార్తలు రాస్తే, పండబెట్టి తొక్కి నార తీస్తానని" మీడియా ముఖంగా జర్నలిస్టులను బూతులు తిట్టిన రేవంత్ రెడ్డి.. నేడు అధికారం వచ్చేసరికి అహంకారంతో అదే పాటిస్తున్నాడు. ఇదేనా ప్రజా పాలన అంటే? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే? జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కార్ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది!’’ అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్‌లో ఓ పోస్టు చేసింది.