Lookout Motices against Bodhan Ex MLA Shakeel Ahmed: హైదరాబాద్ పంజాగుట్ట సమీపంలోని ప్రజా భవన్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మరో పరిణామం జరిగింది. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ (Shakeel Ahmed) కుమారుడు ప్రధాన నిందితుడిగా ఉండగా.. కొద్ది రోజుల క్రితమే మాజీ ఎమ్మెల్యే షకీల్ పేరును కూడా చేర్చారు. తాజాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు. ఈ విషయాన్ని డీసీపీ విజయ్ కుమార్ (DCP Vijay Kumar) కీలక విషయాలను వెల్లడించారు.
ఈ కేసు విషయంలో డీసీపీ విజయ్ కుమార్ మీడియాకు కీలక వివరాలు వెల్లడించారు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు (Shakeel Ahmed) లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని చెప్పారు. పంజాగుట్ట ప్రమాదం కేసులో తన కుమారుడిని తప్పించడానికి షకీల్ సహకరించారని.. రాహిల్‌తో పాటుగా షకీల్ కూడా దుబాయ్‌కి పారిపోయినట్లు పోలీసులు వివరించారు. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట ఇన్స్‌పెక్టర్‌తోపాటుగా బోధన్ సీఐని కూడా అరెస్ట్ చేసినట్లు చెప్పారు. నిందితుడికి పోలీసులు సహకరించినట్టు ఆధారాలు కూడా ఉన్నాయని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని వివరించారు. వారి కోసం వెతుకుతున్నామని డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు.
2022లో మరో యాక్సిడెంట్ కేసు
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 2022లో ఎమ్మె్ల్యే కుమారుడు మరో యాక్సిడెంట్ చేసినట్లుగా డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ యాక్సిడెంట్‌లో ఒక బాబు చనిపోయినట్లు వెల్లడించారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహీల్‌ను తప్పించారనే వార్తలు వచ్చాయన్నారు. ఆ కేసును కూడా తిరిగి విచారణ చేస్తామని డీసీపీ విజయ్ కుమార్ చెప్పారు. ఆ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోందని డీసీపీ విజయ్ కుమార్ వివరించారు.
What is Lookout Circular: లుకవుట్ నోటీసులు అంటే ఏంటి?
ఒక వ్యక్తి మన దేశంలో ఏదైనా క్రైమ్ చేసి విదేశాలు వెళ్లిపోయిన సందర్భంలో ఆ వ్యక్తిపైన జారీ చేసే ఒకరకమైన నోటీసులనే లుకవుట్ నోటీసులు లేదా లుకవుట్ సర్క్యులర్ అంటారు. ఒక వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదైయ్యాక విదేశాల్లో ఉంటున్న సందర్భంలో ఈ నోటీసులను జారీ చేస్తారు. రోడ్డు లేదా సముద్ర మార్గం లేదా వాయు మార్గం ఏదైనా అంతర్జాతీయ సరిహద్దులు వద్ద లేదా పోర్టులు లేదా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో ఇమిగ్రేషన్ తనిఖీల్లో లుకవుట్ నోటీసులు ఉన్న వ్యక్తి పాస్ పోర్టు చెక్ చేయగానే సదరు అధికారులకు తెలిసిపోతుంది. అప్పుడు వారు ఫలానా వ్యక్తి గురించి సదరు పోలీస్ స్టేషన్ కు రిపోర్ట్ చేస్తారు. ఒకసారి జారీ చేసిన లుకవుట్ నోటీసు పరిమితి ఒక ఏడాది పాటు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఏటా కొనసాగింపు చేసుకోవాల్సి ఉంటుంది.