Hyderabad Latest News | హైదరాబాద్: హైదరాబాద్ సిటీ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ విషయంలో పోలీస్ స్టేషన్ల పరిధులు, కమిషనరేట్ల సరిహద్దులు అడ్డుకాకూడదని సీపీ వీసీ సజ్జనర్ (VC Sajjanar) అన్నారు. బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు, నేరం జరిగిన వెంటనే స్పందించేందుకు ‘జీరో డిలే’ విధానాన్ని క్షేత్రస్థాయిలో మరింత పకడ్బందీగా అమలు చేయాలన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం 3 కమిషనరేట్ల కీలక సమన్వయ సమావేశం జరిగింది. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్‌బాబు పాల్గొన్నారు. నగర భద్రత, ట్రాఫిక్ సమస్యలు, నేరస్థుల కదలికలపై వీరు చర్చించారు.
నేరం చేసి మరో కమిషనరేట్ పరిధిలోకి
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో నేరస్తులు ఒక కమిషనరేట్ పరిధిలో నేరం చేసి, మరో కమిషనరేట్ పరిధిలోకి వెళ్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి అధికారులు తీసుకువచ్చారు. పరిధుల పేరుతో పోలీసులు కాలయాపన చేయడం వల్ల నేరస్తులు తప్పించుకునే అవకాశం ఉందన్నారు. కింది స్థాయి సిబ్బంది మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూడాలని సీపీ సజ్జనర్ అన్నారు. నేరం ఎక్కడ జరిగినా, ఏ కమిషనరేట్ పరిధి చూడకుండా సమీపంలోని పోలీసులు వెంటనే స్పందించాలన్నారు.
రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై 3 కమిషనరేట్ల పోలీసులు ఉమ్మడి నిఘా ఉంచాలని, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలన్నారు. రౌడీ షీటర్లు, నేరస్థులు తరచుగా తమ నివాసాలను మారుస్తున్నారని, వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా పక్కా సమాచార మార్పిడి జరగాలని సూచించారు. నేరాలతో పాటు నగరంలో ట్రాఫిక్ నిర్వహణపైనా సమావేశంలో చర్చించారు. 3 కమిషనరేట్ల పరిధిలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఒకేలా హైదరాబాద్‌లోకి వాహనాల నో ఎంట్రీ అమలు
హైదరాబాద్ నగరంలోకి వచ్చే భారీ వాహనాల 'నో ఎంట్రీ' సమయాలను ఒకేలా అమలు చేయాలని, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో ఈ వాహనాలు రోడ్లపైకి రాకుండా, నగరం వెలుపలే నిలువరించాలన్నారు. వీకెండ్స్ లో మందుబాబులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తప్పించుకోకుండా, 3 కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో ఉమ్మడి తనిఖీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వాహనదారుల పెండింగ్ చలానాల వసూలు కోసం 3 కమిషనరేట్ల పరిధిలో ఏకకాలంలో 'స్పెషల్ డ్రైవ్'లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు జంక్షన్ల వద్ద సిగ్నల్ టైమింగ్స్ విషయంలో 2 కమిషనరేట్ల ట్రాఫిక్ పోలీసులు రియల్ టైమ్ గా సమన్వయంతో పనిచేయాలని, దీనివల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉండదన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల వల్ల ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సమన్వయంతో అడుగులు వేయాలన్నారు.
‘‘నేరస్తులకు సరిహద్దులు లేనప్పుడు, పోలీసులకు కూడా ఉండకూడదు. బాధితులకు తక్షణ న్యాయం అందించే ‘జీరో డిలే’ విధానమే ముఖ్యం. 3 కమిషనరేట్లు వేరైనా మన లక్ష్యం 'సేఫ్ హైదరాబాద్' ఒక్కటే. సాంకేతికతను వినియోగించుకుంటూ 3 కమిషనరేట్ల పోలీసులు ‘సింగిల్ ఫోర్స్’లా పనిచేస్తేనే నేరాలను పూర్తిగా అరికట్టగలం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదు’’ అని సీపీ సజ్జనర్ హెచ్చరించారు.
3 కమిషనరేట్లు సమన్వయం చేసుకోవాలి..
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందని, ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ, నేరాల కట్టడికి 3 కమిషనరేట్ల సమన్వయం అత్యవసరమని అన్నారు. మోడ్రన్ టెక్నాలజీ, సీసీటీవీ నెట్‌వర్క్‌ను అనుసంధానించడం ద్వారా నేరస్తుల కదలికలను రియల్ టైమ్‌లో పసిగట్టవచ్చని అన్నారు.
జాయింట్ టీమ్స్ ఏర్పాటు చేయాలి
రాచకొండ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్ సిటీలో నేరాల నియంత్రణకు జాయింట్ టీమ్స్ ని ఏర్పాటు చేసి.. 3 కమిషనరేట్లు సమన్వయంతో పని చేయాలన్నారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచడంతో పాటు గంజాయి, డ్రగ్స్ వంటి వాటిని అరికట్టడంలోనూ సమాచార మార్పిడి కీలకమన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ ఎం.శ్రీనివాసులు, జాయింట్ సీపీలు తఫ్సీర్ ఇక్బాల్, జోయల్ డెవిస్, గజరావు భూపాల్ తో పాటు 3 కమిషనరేట్ల డీసీపీలు పాల్గొన్నారు.