Telangana Assembly Speaker | హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా వినిపిస్తున్న “సేవ్ ది కానిస్టిట్యూషన్” నినాదం, ఈ రోజు స్పీకర్ ఇచ్చిన తీర్పుతో పూర్తిగా బహిర్గతమైందని ఎద్దేవా చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజ్యాంగ సంస్థలను కూడా దిగజార్చడం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని, ఈరోజు స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. 

Continues below advertisement

తీర్పు కాపీని చెక్ చేసిన తరువాత హైకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కె.సంజయ్‌ తెలిపారు. స్పీకర్ సమగ్ర విచారణ చేసి నిర్ణయం తీసుకోవాలి, కానీ తమ వాదన పట్టించుకోకుండా ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వారు ప్రచారం చేశారంటే పార్టీ మారినట్లే కదా. కానీ రాజ్యాంగవిరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారని పేర్కొన్నారు. తెల్లం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ బుధవారం కొట్టివేశారు.

రాజ్యాంగ ఉల్లంఘనపై ఘాటు విమర్శలుపార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో భారత రాజ్యాంగం స్పష్టంగా నిర్దేశించిన యాంటీ-డిఫెక్షన్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) నియమాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందని హరీశ్ రావు ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యవస్థను అధికార పార్టీకి అనుకూలంగా వాడుకోవడం రాజ్యాంగాన్ని కాలరాయడమేనని పేర్కొన్నారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికతపై గొప్ప ఉపన్యాసాలు ఇచ్చే నాయకులు, తెలంగాణలో మాత్రం అదే రాజ్యాంగాన్ని సిగ్గు లేకుండా ధిక్కరిస్తున్నారని, ఇదే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీల నిజస్వరూపమని హరీష్ రావు విమర్శించారు.

Continues below advertisement

ప్రజాస్వామ్యానికి మాయని మచ్చరాజ్యాంగాన్ని రక్షించడం అంటూ కాంగ్రెస్ పార్టీకి కేవలం మాటలకే పరిమితమైందని, ఆచరణలో మాత్రం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి చెరగని మచ్చ, ఎంతో సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు స్వతంత్రంగా వ్యవహరించాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై స్పీకర్ నిర్ణయం: బీజేపీ ఘాటు విమర్శలుతెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారంపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ముమ్మాటికీ "రాజ్యాంగ హత్య, ప్రజాస్వామ్య హత్య" అని ఆయన అభివర్ణించారు. రాజ్యాంగాన్ని కాపాడుతామని నిరంతరం ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ పార్టీ, చివరకు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ వ్యవస్థను కూడా ప్రభావితం చేసి తప్పుడు నిర్ణయం వచ్చేలా చేసిందని ఆరోపించారు.

కాంగ్రెస్ నైతికతపై ప్రశ్నలుపార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని (Anti-Defection Law) తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అయినప్పటికీ, ఈరోజు అదే పార్టీ ఆ చట్టానికి కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తోందని రాంచందర్ రావు మండిపడ్డారు. చేతుల్లో రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకుని దేశమంతా పర్యటిస్తున్న రాహుల్ గాంధీ లాంటి నాయకులే, రాజ్యాంగ విలువలపై దాడి చేస్తున్నారని విమర్శించారు. స్పీకర్ పదవి అనేది స్వతంత్రంగా,  పక్షపాతం లేకుండా పనిచేయాల్సిన అత్యున్నత పదవి అని, కానీ ప్రస్తుత నిర్ణయం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు.