ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్ర దాడికి తెలంగాణ కనెక్షన్ ఉండటం ఇక్కడ కలకలం రేపుతోంది.హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డాగా మారిపోయిందంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు.
Raja Singh Comments: ఆస్ట్రేలియా సిడ్నీలోని ఉగ్రవాద కాల్పుల ఘటనకు హైదరాబాద్ కనెక్షన్ ఉండటం కలకలం రేపడమే రాజకీయంగానూ అలజడి రగిలిస్తోంది. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ మాజీ నేత టి.రాజాసింగ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి హెచ్చరికలు చేశారు. ఉగ్రవాదం విషయంలో కఠినంగా వ్యవహరించకుండా బుజ్జగింపు రాజకీయాలు చేసుకుంటూ వెళితే ఇక్కడ కూడా భారీ ముూల్యం చెల్లించుకోవలసి వస్తుందన్నారు. సిడ్నీలోని బాండి బీచ్ వద్ద హనుక్కా వేడుకల సమయంలో జరిగిన కాల్పుల ఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదుల అడ్డాగా ఓవైసీ గడ్డ- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన వ్యక్తి సాజిద్ అక్రమ్, అతని కుమారుడు నవీద్ కలిసి ఆస్ట్రేలియాలో ఉగ్రదాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీయగా, దీనిపై రాజాసింగ్ ఘాటుగా స్పందించారు. “ప్రపంచంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని వెనుక మూలాలు హైదరాబాద్‌తోనే ముడిపడుతున్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారింది” అంటూ రాజాసింగ్ నేరుగా ఆరోపణలు చేశారు. "దేశంలో ఎక్కడ అలజడి రేగినా దానికి మూలాలు హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో కనిపిస్తాయి. టోలీచౌకీలో ఒకప్పుడు నివసించిన వ్యక్తి ఇప్పుడు విదేశాల్లో ఉగ్రదాడి చేశారు. టోలీచౌకి ఓవైసీ పార్లమెంట్ స్థానం" అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు
ఓవైసీతో దోస్తీ మంచిది కాదు- రేవంత్‌కు హెచ్చరిక
ఆస్ట్రేలియాలో జరిగిన ఉగ్రదాడిని తేలకగా తీసుకోవద్దని రాజాసింగ్ సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. టోలీచౌకి వ్యక్తికి సంబంధం ఉన్నందున అతని బంధువులను విచారణ చేయాలని సూచించారు.'ఓటుబ్యాంక్, బుజ్జగింపు రాజకీయాలు చేస్తే తెలంగాణ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని' హెచ్చరించారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరవాలని ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ నిఘాను బలపరచాలని సూచించారు. "ఓవైసీతో దోస్తీ ఇవాళ కాకపోతే రేపైనా చేటు చేస్తుంది. దానిని వదిలేయండి. టెర్రరిస్టులతో ఓవైసీకి ఉన్న లింక్ ఇవాళ కాకపోయినా రేపైనా బయటపడుతుంద"ని సీఎం రేవంత్ రెడ్డికి సూచన చేశారు.