Bondi Beach Shooting: ఆస్ట్రేలియా ఉన్మాద ఉగ్రవాద కాల్పులకు పాల్పడింది హైదరాబాద్ వ్యక్తి అని తేలడంతో నగరంలో అలజడి రేగింది. కాల్పుల ఘటన తర్వాత నిందితుల్లో ప్రధాన వ్యక్తి సాజిద్ అక్రమ్ వద్ద ఇండియన్ పాస్‌పోర్టు గుర్తించారు. అతను హైదరాబాద్‌కు ట్రావెల్ చేసినట్లు తెలీడంతో లోకల్‌గా కలకలం రేగింది. హైదరాబాద్‌కు ప్రయాణం చేయడం మాత్రమే కాదు.. అతను హైదరాబాద్‌ వాసే. అయితే ఆస్ట్రేలియా కాల్పులకు లోకల్‌ కనెక్షన్ ఇంతవరకూ గుర్తించలేదు పోలీసులు.

Continues below advertisement

సాజిద్ అక్రమ్ టోలీచౌకి వాసి..

డిసెంబర్ 14వ తేదీ ఆదివారం నాడు సిడ్నీలోని బాండి బీచ్‌లో, హనుక్కా పండుగ  జరుగుతుండంగా ఇద్దరు వ్యక్తులు బహిరంగంగా కాల్పులకు తెగబడ్డారు. 15మంది ప్రాణాలు పోయాయి. వారిద్దరూ తండ్రి కొడుకులుగా గుర్తించారు. దాడి చేసిన వారిని సాజిద్ అక్రమ్ (50) మరియు అతని కుమారుడు నవీద్ అక్రమ్ (24)గా గుర్తించారు. ISIS ప్రేరేపిత భావజాలంతో ఈ పనికి పాల్పడ్డారని  గుర్తించారు. పోలీసు కాల్పుల్లో చనిపోయిన సాజిద్ దగ్గర ఇండియన్ పాస్‌పోర్టు దొరికింది. అంతే కాదు అతను హైదరాబాద్ వాసి అని తెలుసుకున్నారు. హైదరాబాద్‌లో బి.కామ్ డిగ్రీని పూర్తి చేసి, సుమారు 27 సంవత్సరాల క్రితం.. 1998 నవంబర్‌లో అతను  ఆస్ట్రేలియాకు వలస వెళ్ళాడు. ఆ తర్వాత యూరోప్‌కు చెందిన  వెనెరా గ్రోసోను వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యాడు. అతనికి కుమారుడు నవీద్ అక్రమ్ (తండ్రితో పాటు కాల్పుల్లో పాల్గొని గాయపడ్డాడు),కుమార్తె ఆస్ట్రేలియాలో జన్మించారు. వారు ఆస్ట్రేలియా పౌరులు.

Continues below advertisement

తండ్రి చనిపోయినా రాలేదు.

టోలీచౌకిలోని అల్‌హసంత్ కాలనీలో సాజిద్‌కు ఇళ్లు ఉండేది. ఆయన తండ్రి ఖలీద్ అక్రమ్ UAE మిలటరీలో పనిచేసి వచ్చి ఇక్కడ ఇళ్లు కొనుక్కున్నారు. ఆస్ట్రేలియా వెళ్లిపోయిన తర్వాత ఈ 27 ఏళ్లలో సాజిద్ పెద్దగా ఇండియా రాలేదు. ఆస్తి విషయాలను సెటిల్ చేసుకునేందుకు మాత్రమే వచ్చాడు. చివరకు తండ్రి చనిపోయినప్పుడు కూడా రాలేదు. 2022లో ఆస్తి వివాదాన్ని సెటిల్ చేసుకుని ఇంటిని తన అన్న షహిద్ అక్రమ్‌కు ఇచ్చేశాడు. సాజిద్ పిల్లలను అయితే స్థానికులు ఎవరూ చూడలేదు. వాళ్లు అక్కడే పెరిగారు.

తెలంగాణతో కనెక్షన్ లేదు.

 అతని తీవ్రవాద మనస్తత్వం , కార్యకలాపాల గురించి, తమకు ఎలాంటి అవగాహన లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. సాజిద్ అక్రమ్ , అతని కుమారుడు నవీద్ తీవ్రవాదులుగా మారడానికి దారితీసిన కారణాలకు భారత్  తెలంగాణలోని ఏ స్థానిక ప్రభావంతో సంబంధం లేదని తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఆధారాలు ప్రస్తుతానికి పోలీసులకు దొరకలేదు. సాజిద్ తెలంగాణ నుంచి ఆస్ట్రేలియా వెళ్లే ముందు కూడా అతనిపై క్లీన్ రికార్డు ఉంది. బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరికీ తీవ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించలేదు. అయితే సాజిద్ విషయం బయటకు వచ్చిన వెంటనే ఆ ఇంట్లో ఉన్న సోదరుడు… ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయారు. పోలీసులు ప్రస్తుతానికైతే వాళ్లపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదు కానీ.. వీరికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు.