హైదరాబాద్‌లో ఓ వృద్ధుడు వింత చేష్టకు పాల్పడ్డాడు. ఓ వీధి కుక్క పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ గుర్తు తెలియని వ్యక్తిపై నల్లకుంటలోని పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే, ఈ వ్యవహారం కాస్త ఆలస్యంగా బయటికి వచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి ఈ నెల 6న వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఇది ఓ జంతు ప్రేమికుడు చూడడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నల్లకుంట పోలీసులు కుక్కతో వింతగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
నల్లకుంట పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వీధి కుక్క పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నల్లకుంటలోని నర్సింహ బస్తీలో 60 ఏళ్ల వయసు గల ఓ వృద్ధుడు వీధి కుక్క ప్రైవేట్ అవయవంపై చెయ్యి వేసి అసభ్యకరంగా నిమిరాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫోన్‌లో వీడియో తీశాడు. ఈ నెల 6న అది వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. అలా అది నల్లకుంటలోని బృందావన్ కాలనీలో నివసించే యానిమల్ ప్రొటెక్షన్ సభ్యుడు, జంతు ప్రేమికుడు అయిన పన్నీర్ తేజను చేరింది. వెంటనే నర్సింహబస్తీకి వెళ్లిన ఆయన ఆ వీధి కుక్కను గుర్తించి ప్రథమ చికిత్స చేయించారు. ఆ చర్యకు పాల్పడిన సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని గత ఆదివారం నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తించే పనిలో ఉన్నారు.
పెరిగిన వీధి కుక్కల సంఖ్య
పదేళ్లలో హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. పదేళ్ల క్రితం వాటి జనాభా 1.5 లక్షలు ఉండగా, గత జూన్ నాటికి వీటి సంఖ్య 6.97 లక్షలకు చేరింది. గతంలో వీధికుక్కలు పిల్లలపై దాడి చేయడం వల్ల వారు మరణించిన సంగతి తెలిసిందే. గతేడాది జనవరిలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలుడు అయాన్‌పై దాడి చేశాయి. ఈ దుర్ఘటనలో బాలుడు అయాన్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. మరో బాలుడికి గాయాలయ్యాయి. అప్పటి నుంచి జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టింది.
వీధి కుక్క కరిస్తే ఇలా చేయాలి
కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. కుక్క కొరకడం వల్ల దాని లాలాజలంలో ఉండే వైరస్ రోజుకు అర సెంటిమీటర్ చొప్పున పైకి ఎగబాకుతుంది. ఇది నరాలు, మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్వరం, తల నొప్పి, వాంతులు తొలిదశలో కనిపిస్తాయి. రెండో దశలో పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించలేక పోవడం, నోటిలోంచి నురుగు రావడం, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి ఉంటాయి. తర్వాత పూర్తిగా కోమాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కుక్క కరిస్తే పారుతున్న నీటితో శుభ్రంగా కడగాలి. రక్తం కారుతున్నా, లేదా పిక్క ఊడినా కట్టు కట్టకూడదు. మట్టి, పసుపు, ఆకుపసరు వంటి నాటు వైద్యాల జోలికి పోకూడదు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. కరిచిన తర్వాత ఒకటి, ఆ తర్వాత 3, 7, 14, 28 రోజుల్లో ఇంజెక్షన్లు వేయించుకోవాలి.