Hyderabad News: ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న ఘటనలు రోజూ ఎక్కడో ఒక దగ్గర వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఇష్టం లేదని అమ్మాయిలు చెప్పినా మృగాళ్ల రూపంలోని మగాళ్లు వినిపించుకోవడం లేదు. తాజాగా అలాంటి వేధింపులు ఓ యువతి ప్రాణాలు తీశాయి. పెళ్లి బంధంతో కొత్త ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఆ యువతి.. చివరికి ప్రాణాలు బలితీసుకుంది. పెళ్లైన ఓ యువకుడి వేధించడం, ఖాయమైన పెళ్లిని చెడగొట్టడంతో తీవ్రంగా మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ యువకుడి దుశ్చర్యతో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.
అసలేం జరిగిందంటే..?
ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో చోటు చేసుకుంది. బైరంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య కుమార్తె అనూష (22) డిగ్రీ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. ఆమె తల్లి చాలా కాలం క్రితమే చనిపోయింది. ఈ యువతికి ఇటీవలె ఓ కానిస్టేబుల్ తో నిశ్చితార్థం జరిగింది. బైరంపల్లి గ్రామానికే చెందిన శ్రీకాంత్ అనుషూతో నిశ్చితార్థం చేసుకున్న కానిస్టేబుల్ కు ఫోన్ చేసి తాను ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీయడంతో అతడు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. శ్రీకాంత్ కు ఇప్పటికే పెళ్లి జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. పెళ్లి ఆగిపోవడంతో మనస్తాపం చెందిన యువతి శుక్రవారం రాత్రి గదిలో ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు తెల్లవారి చూసే సరికి చనిపోయి కనిపించింది. మృతురాలి సోదరుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కోన వెంకటేశ్వరలు తెలిపారు.
రెండ్రోజుల క్రితం నిశ్చితార్థం రద్దవుతుందన్న భయంతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
నిశ్చితార్థం రద్దవుతుందేమోనన్న భయంతో ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. గతంలోనే ఓ సారి పెళ్లి నిశ్చయం అయి నిశ్చితార్థం అయ్యాక క్యాన్సిల్ అయింది. ఏడాది తర్వాత మళ్లీ పెళ్లి కుదిరింది. అయితే వరసకు అతడు.. సదరు మహిళకు కొడుకు అవుతాడని కుటుంబ సభ్యులు మాట్లాడుకోవడం విని.. ఈ నిశ్చితార్థం కూడా ఎక్కడ క్యాన్సిల్ అవుతోందనని భయపడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది.
రంగారెడ్డి జిల్లా కందుకూరు జైతారం గ్రామానికి చెందిన 28 ఏళ్ల సురేఖ 2018 బ్యాచ్ కానిస్టేబుల్. అయితే ఈమె ప్రస్తుతం తన సోదరితో కలిసి అలియాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటోంది.హైదరాబాద్ లోని పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో పని చేస్తుంది. అయితే సురేఖకు ఏడాది క్రితం నిశ్చితార్థం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆ పెళ్లి రద్దు అయింది. అయితే ఏడాది తర్వాత అంటే ఈనెల 1వ తేదీన స్వగ్రామానికి చెందిన మరో యువకుడితో పెళ్లి కుదిరింది. అయితే ఆ యువకుడు సురేఖకు వరుసకు కొడుకు అవుతాడట. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు చర్చించుకుంటుండగా సురేఖ విన్నది. ఈ క్రమంలోనే గతంలో లాగానే ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అవుతుందేమోనని భయపడింది. తన పరువు పోతుందని భావించి ప్రాణాలు తీసుకోవడం మేలనుకుంది. అనుకున్నదే తడువుగా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న శాలిబండ పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.