Hyderabad News: మొన్న బాలుడిపై కుక్కల దాడి జరగడం.. నాలుగేళ్ల బుడతడు చనిపోవడంతో హైదరాబాదీలు కుక్కలను చూస్తేనే వణికిపోతున్నారు. గుంపులుగా వస్తుంటే మరింత బెదిరిపోతున్నారు. ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తాయేమోనని ఆందోళనతో కొందరు బయటకు వెళ్లడమే మానేస్తున్నారు. ఈ సమయంలో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) తక్షణఁ స్పందించాలి. రోడ్లపై గుంపులుగా తిరుగుతున్న కుక్కలను నిరోధించే చర్యలను తీసుకోవాలి. కానీ జీహెచ్ఎంసీ మాత్రం కాలనీల్లో కుక్కలను పట్టుకోవాలంటే.. ముందుగా సంబంధిత డివిజన్ కార్పొరేటర్ అనుమతి తప్పనిసరని సూచిస్తోంది. అనుమతి లేకుండా కుక్కలను పట్టుకుంటే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మేయర్ అధ్యక్షతన మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష కార్పొరేటర్ల సమావేశంలో తీసుకున్న తాజా నిర్ణయం మరిన్ని విమర్శలకు తావిస్తోంది.


అనుమతి కోసం చూస్తే.. శునకాల పట్టివేతలో తీవ్ర జాప్యం


అంబర్ పేటలో నాలుగేళ్ల బాలుడిపై శునకాల దాడి ఘటన తర్వాత బల్దియా లోపాలను సరిదిద్దుకోవాల్సి ఉంది. కుక్కల సంఖ్య నియంత్రించడంతో పాటు దాడులకు పాల్పడే వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు తరలించాలి. అందుకు భారీగా కసరత్తు అవసరం. వెటర్నరీ విభాగంలో సిబ్బంది సంఖ్య పెంటాలి. విస్తృతంగా కుక్కల కు.ని ఆపరేషన్లు చేయాలి. కానీ ఈ దిశగా ఇప్పటి వరకు అధికారులు చర్యలు తీసుకోలేదు. దానికి భిన్నంగా మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కార్పొరేటర్ అనుమతి కోసం చూస్తే శునకాల పట్టివేత ముందుకు సాగదని అధికారులు చెబుతున్నారు. 


మృతి చెందిన బాలుడి కుటుంబానికి పది లక్షల రూపాయల పరిహారం


ఇటీవల హైదరాబాద్ లోని అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో చనిపోయిన బాలుడు ప్రదీప్ కుటుంబానికి జీహెచ్ఎంసీ పరిహారం ప్రకటించింది. మొత్తం రూ.10 లక్షలను బాలుడి కుటుంబానికి అందజేయనున్నారు. జీహెచ్ఎంసీ రూ.8 లక్షలు, కార్పొరేటర్ల జీతం నుంచి రూ.2 లక్షల రూపాయాలు కలిపి మొత్తం పది లక్షల రూపాయాలను కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి పరిహారంగా చెల్లించనున్నట్లు ప్రకటించారు. కుక్కల బెడదపై కమిటీ వేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయం తీసుకుంది. మరోవైపు హైదరాబాద్‌లో (GHMC) పరిధిలో వీధి కుక్కల బెడద నుంచి విముక్తికి అధికారులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుక్కల దాడి ఘటనలను  దృష్టిలో ఉంచుకుని జీమెచ్ఎంసీ అధికారులు కొన్ని మార్గదర్శకాలు జారీచేశారు.


ఫిబ్రవరి 19న అంబర్‌పేట్‌లో కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్‌ చనిపోవడం తెలిసిందే. తండ్రి నిచేసే చోటుకు వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు బలితీసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ కావడడంతో పిల్లల తల్లిదండ్రులు, మానవ హక్కుల సంఘాలు, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రెగ్యూలర్ గా ఇలాంటి ఘటనలు జరుగుతన్నా జీహెచ్ఎంసీ ఏ చర్యలు తీసుకోలేదని.. కుక్కుల విషయాన్ని గాలికొదిలేయడంతో చిన్నారి చనిపోయాడంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ విషయంలో జీహెచ్ఎంసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ హైకోర్టు సైతం ఈ ఘటనను సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది. ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది.