Hyderabad News: "అంబర్ పేటలో ఓ మహిళ రోజూ వీధి కుక్కలకు మాంసం అందిస్తుంది. రెండు రోజులుగా ఆమె కనిపించడం లేదు. సోమవారం నుంచి ఆహారం లేకపోవడంతో... ఆకలిని తట్టుకోలేక ఆ కుక్కలు నాలుగేళ్ల బాలుడిపై దాడి చేశాయి" అని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి తెలిపారు. ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరం అని వివరించారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. బాధిత కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. శునకాలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలోనే ఆమె అధికారులతో సమావేశం అయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చర్చించారు. 






బల్దియా లెక్కల ప్రకారం నగరంలో ఐదు లక్షల 70 వేలకు పైగా కుక్కలు ఉన్నాయని.. వీధి కుక్కలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. వీధి కుక్కలను కంట్రోల్ చేయడానికి చర్యలు తీసుకుంటామని, ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా కుక్కలను స్టెరిలేజ్ చేసినట్లు చెప్పారు. అలాగే మిగతా కుక్కలను స్టెరిలైజ్ చేసేందుకు ప్రతీరోజూ 30 వాహనాలు తిరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. 


మంత్రి తలసాని స్పందన..


ఇదే ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా స్పందించారు. బాలుడి ప్రదీప్ మృతి బాధాకరం అని.. బాలుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నామన్నారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. వీధి కుక్కలు, కోతుల సమస్య పరిష్కారంపై ఈనెల 23వ తేదీన మాసబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో కలిసి చర్చిస్తామన్నారు. కుక్కల బెడదతో చిన్నారులు, మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. అవసరమైన చర్యలు చేపట్టడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 


మరోవైపు నిన్న వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాలుడు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హైదరాబాద్ అంబర్‌పేటలో జరిగిన ఘటనలో నాలుగేళ్ల బాలుడి మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. నగరంలో వీధి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చ‌ర్యలు తీసుకుంటామ‌న్నారు. ప్రతి మున్సిపాలిటీలో వీధి కుక్కల స‌మ‌స్యను  వీలైనంత తర్వగా ప‌రిష్కరించేందుకు ప్రయ‌త్నిస్తున్నామన్నారు.  దీని కోసం జంతు సంర‌క్షణ కేంద్రాల‌ు, జంతు జ‌న‌న నియంత్రణ కేంద్రాల‌ు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. కుక్కల స్టెరిలైజేష‌న్ కోసం చ‌ర్యలు చేప‌డుతున్నామ‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడి మృతి చెందిన ఘటన హైదరాబాద్‌ అంబర్‌పేటలో సోమవారం చోటుచేసుకుంది. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వస్తున్న బాలుడిపై కుక్కలు నాలుగు వైపులా కాపుకాసి దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడు మృతిచెందాడు.