Hyderabad News: ఈరోజు ఉదయం మియాపూర్ లో కాల్పుల కలకలం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనలో కలకత్తాకు చెందిన దేబెందర్ అనే వ్యక్తి మృతి చెందగా.. పోలీసులు కేసును ఛేదించారు. దేబెందర్.. 9 ఏళ్లుగా సందర్శిని హోటల్ లో మేనేజర్ గా పని చేస్తున్నట్లు మాదాపూప్ డీసీపీ సందీప్ వివరించారు. అదే హోటల్ లో కేరళకి చెందిన రతీష్ నాయర్ మేనేజర్ గా చేరాడని.. అయితే ఆ హోటల్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళీ అవ్వగా వీరిద్దరూ పోటీ పడినట్లు స్పష్టం చేశారు. ఈ పోస్ట్ కోసం ఇద్దరి మధ్య గట్టి పోటీ రాగా... దేబేందర్ పని తీరు మంచిగా ఉండటంతో పైఅధికారులు ఇతడికి జనరల్ మేనేజర్ గా ప్రమోషన్ ఇచ్చారని వెల్లడించారు. దీంతో దేబేందర్ పై.. రితీష్ కోపం పెంచుకున్నాడని స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య తరుచూ గొడవ జరిగేదని.. రితీష్ ప్రవర్తన బాగోలేకపోవడంతో.. రితీష్ ని ఉద్యోగం లో నుంచి తొలగించారని చెప్పారు.
దీంతో దేబెందర్ పై కోపం పెంచుకున్న రితీష్.. అతడిని ఎలాగైనా సరే చంపాలి అనుకున్నట్లు వివరించారు. ఈక్రమంలోనే రితీష్ బీహార్ వెళ్లి.. ఒక కంట్రీ మేడ్ పిస్టల్ కొన్నట్లు పేర్కొన్నారు. దేబేందర్ హోటల్ నుంచి బయటకు వచ్చే టైం లో కాపు కాసి మరీ పక్కా ప్లాన్ ప్రకారం గన్ తో కాల్చి చంపినట్లు డీసీపీ సందీప్ వివరించారు. మొత్తం 5 రౌండ్లు కాల్పులు జరిపగా.. 5 బుల్లెట్లు దేబెందర్ బాడీలో దిగినట్లు పేర్కొన్నారు. తర్వాత మెట్రో ట్రైన్ లో పారిపోయే ప్రయత్నం చేశాడని.. అప్పటికే రితీష్ కోసం గాలిస్తున్న ప్రత్యేక టీమ్స్ రితీష్ ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కేవలం 8 గంటల్లోనే కేసును ఛేదించామన్నారు.
అసలేం జరిగిందంటే..?
Miyapur Gun Fire Incident: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు.. ఓ రెస్టారెంట్ జనరల్ మేనేజర్‌పై కాల్పులకు తెగబడ్డారు. మదీనా గూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్‌లో జనరల్ మేనేజర్‌గా పని చేస్తున్న 35 ఏళ్ల దేబెందర్ గాయన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. దేశవాళీ తుపాకీతో మొత్తం ఆరు రౌండ్లు కాల్పులు జరపగా.. దేవేందర్ గాయన్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అలాగే అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలోనే దేవేందర్ గాయన్ మృతి చెందాడు.
హుటాహుటిన రంగంలోకి దిగిన మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలాన్ని మాదాపూర్ జోన్ డీసీప్ సందీప్ రావు, మియాపూర్ ఏసీపీ నరసింహా రావు పరిశీలించారు. అయితే కా కాల్పులకు కారణం పాత కక్షలే కారణం అని ప్రాథమికంగా భావించగా... కేవలం 8 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. అందుకు గల కారణాలు, ఎలా, ఎప్పుడు హత్య చేశారనే పూర్తి వివరాలను తెలుసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు.