Shad Nagar Fire Accident: షాద్ నగర్ లోని అల్విన్ ఫార్మా కంపెనీలో పెద్ద అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నించారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. అగ్నిప్రమాదం సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు పని చేస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో కంపెనీలో దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మంటల వేడి తాళలేక బిల్డింగ్ పైనుంచి నలుగురు కార్మికులు దూకినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్ధ నాదాలు చేశారు. తోటి కార్మికులు లోపల ఉన్నవారిని బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు. కార్మికులను ఫైర్ సిబ్బంది బయటకు రప్పించారు. నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి కార్మికులు బయటికి వచ్చారు. ఇంకా ఎవరైనా మంటల్లో చిక్కుకున్నారా అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. మంటల దాటికి చుట్టుపక్కల దట్టంగా పొగ వ్యాపించింది. పొగతో స్థానికులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు.
ఓ బాలుడి తెలివిని మెచ్చిన పోలీసులు
అగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడు చేసిన పని అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అగ్ని ప్రమాదం పెద్దదని భావించిన బాలుడు మంటలు ఉన్న భవనం పై అంతస్తుల్లో ఉన్న ఓ కిటికీకి తాడు కట్టాడు. ఆ తాడు ద్వారా దాదాపు 50 మంది వరకూ కార్మికులు కిందికి దిగగలిగారు. బాలుడు చేసిన పనిని గుర్తించిన పోలీసులు అతణ్ని అభినందించారు. అయితే, ఆ బాలుడి గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.