New Year Celebrations 2026: కాల చక్రంలో మరో ఏడాది ముగిసిన, కొత్త సంవత్సరం ఆహ్వానం పలికేందుకు భాగ్యనగరం సిద్ధమవుతోంది. అయితే సంబరాల పేరుతో హద్దులు మీరి ప్రవర్తించే వారిని అడ్డుకునేందుకు హైదరాబాద్ మెట్రో పాలిటిన్ పోలీస్ యంత్రాంగం ముందస్తుగా కఠిన చర్యలకు ఉపక్రమించింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోండి... కానీ నిబంధనల చట్రంలోనే అంటున్నారు పోలీసులు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును పోలీసులు సిద్ధం చేశారు.
నిఘా నేత్రాల నీడలో నగరం: బంజారాహిల్స్‌లోని అత్యాధునిక తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్ వేదికగా సీపీ సజ్జనార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో క్షేత్రస్థాయి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేస్తూ, నగరం మొత్తం నిఘా నేత్రాల పర్యవేక్షణలో ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా గతంలో నేరాలు జరిగిన ప్రాంతాలు, రద్దీగా ఉండే హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అనుమానితులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.
డ్రంక్ అండ్ డ్రైన్‌లో పట్టుబడితే పదివేల జరిమానా
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఈ సారి అత్యంత కఠినంగా వ్యవహరించనున్నారు. డిసెంబర్ 31వ తేదీ నగరవ్యాప్తంగా ఏకంగా వంద ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అదనంగా ఏడు ప్లటూన్ల బలగాలను రంగంలోకి దించుతున్నారు.
ఒక వేళ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని సీపీ హెచ్చరించారు. పదివేల జరిమానా విధించడంతోపాటు వాహనాన్ని అక్కడికక్కడే సీజ్‌చేస్తారు
కోర్టు ద్వారా ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అంతేకాకుండా సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసి అధికారం కూడా పోలీసులకు ఉంది. వేడుకలకు వెళ్లే వారు డెసిగ్నేటెడ్ డ్రైవర్‌ను ఏర్పాటు చేసుకోవాలని లేదా క్యాబ్‌లను ఆశ్రయించాలని పోలీసులు సూచిస్తున్నారు. యువతలో ఉండే అతి ఉత్సాహం వల్ల రూడ్లపై రేసింగ్‌లు, వీలింగ్‌లు, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఈవెంట్ నిర్వాహకులకు షరతులు
నగరంలో ఉన్న పబ్‌లు, త్రీస్టార్, అంతకంటే పై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలను సమయపాలనను కచ్చితంగా అమలు చేయనున్నారు. అర్థరాత్రి ఒంటిగంట వరకే వేడుకలకు అనుమతి ఉంటుంది. శబ్దకాలుష్యం నిబంధనలు పాటించని వారిపై, నిర్ణీత డెసిబెల్స్ దాటి సౌండ్స్ సిస్టమ్స్ వాడే వారిపై చర్యలు తీసుకుంటారు. అలాగే వేడుకల నెపంతో గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగినా, అశ్లీల నృత్యాలకు తావిచ్చినా ఆయా సంస్థల లైసెన్స్‌లను తక్షణమే ద్దు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
మహిళల భద్రత కోసం మఫ్టీలో షీ టీమ్స్
న్యూ ఇయర్ వేడుకల్లో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వేదికలు, ప్రదాన జంక్షన్‌లలో 15 షీటీమ్స్ మఫ్టీలో ఉండి నిఘా వేస్తాయి. వేధింపులకు పాల్పడే ఆకతాయిలను గుర్తించి తక్షణమే అదుపులోకి తీసుకుంటారు.
ఏడా పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా కొంత మంది అతి ఉత్సాహం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పపెట్టుకొని మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం, పోలీసు శాఖ. అందులో భాగంగా పదివేల రూపాయల జరిమానా విధింపు రూల్ తీసుకొచ్చారు.