Hyderabad Latest News: హైదరాబాద్ లో డ్రగ్స్ చెలామణి ఆగడం లేదు. మాదక ద్రవ్యాల వినియోగం చాపకింద నీరులాగా విస్తరిస్తూనే ఉంది. తాజాగా హైదరాబాద్ మణికొండ సమీపంలోని ఖజాగూడలో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ది కేవ్ పబ్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. అక్కడ మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారని తేలింది. డ్రగ్స్ వినియోగంపై ముందస్తు సమాచారం రావడంతోనే రాయదుర్గం పోలీసులు, నార్కొటిక్ బ్యూరో అధికారులు సంయుక్తంగా పబ్ ప ఆకస్మిక దాడి చేశారు.
పబ్ లో ఉన్న సుమారు 50 మందిని అదుపులోకి తీసుకుని వారికి పరీక్షలు నిర్వహించగా.. అందులో 24 మందికి డ్రగ్స్ పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లుగా పోలీసులు తెలిపారు. దీంతో అందరిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో పబ్ నిర్వాహకులతో పాటు, డీజే ఆపరేటర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ పబ్ లో గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు సేకరిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడి డీజే ఆపరేటర్‌తో కలిసి పబ్ నిర్వహకులు వినియోగదారులకు డ్రగ్స్ అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు మూల కారకులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్నవారిని నేడు పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.