Hyderabad Rains: హైదరాబాద్ నగరంలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, డ్రైనేజీలు జలమయయ్యాయి. ఎగువ నుంచి వస్తున్న వరదనీటితో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ నుంచి 6 వేల క్యూసెక్కుల నీరు మూసీలోకి వదిలారు. దీంతో మూసారాంబాగ్‌ బ్రిడ్జి వద్ద నీటి ప్రవాహం పెరిగింది. బ్రిడ్జి ఆనుకొని వరద నీరు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మంగళవారం (సెప్టెంబరు 5) రాత్రి 9 గంటల నుంచి మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపి వేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ తెలిపారు. 


చిగురుటాకులా వణికిన హైదరాబాద్
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు హైదరాబాద్‌ చిగురుటాకులా వణికిపోయింది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌రోడ్‌, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్‌, సికింద్రాబాద్‌, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్‌, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌ ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. 






బొల్లారం, చిలకలగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెబీ కాలనీ, ఆల్విన్‌ కాలనీ, మియాపూర్‌, కుత్భుల్లాపూర్‌, బీహెచ్‌ఈఎల్‌, కొండాపూర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, మెహదీపట్నంలో వాన దంచికొడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. నీరు నిలిచి ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. నగరవాసుల జీవనం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరింది.






‘హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దయచేసి అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లండి. 3,000 కంటే ఎక్కువ మంది సభ్యులతో కూడిన మా బృందాలు, నగరం అంతటా నీటి నిలిచిన ప్రాంతాలను క్లియర్ చేయడానికి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. GHMC-DRF సహాయం కోసం 040-21111111, 90001 13667కు కాల్ చేయవచ్చు” అని GHMC కమిషనర్ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు.


డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో నీరు, పడిపోయిన చెట్లను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఆరామ్‌ఘర్ వద్ద నీటిలో చిక్కుకుపోయిన TSRTC బస్సును ట్రాఫిక్ పోలీసులు, GHMC DRF బృందాలు విజయవంతంగా రక్షించాయి. అలాగే శ్రీనగర్‌లో వర్షపు నీటిలో చిక్కుకున్న మరో బస్సును జీహెచ్‌ఎంసీ ఎంఈటీ, డీఆర్‌ఎఫ్ బృందాలు బయటకు తీశారు.