హైదరాబాద్‌ మెట్రో రైలు సర్వీసులకు మరోసారి అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ అసెంబ్లీ మెట్రో స్టేషన్‌లో మెట్రో రైలు ఆగిపోయింది. దాదాపు అర గంట నుంచి రైలు ఎటూ కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. ఆగిపోవడానికి గల కారణాలను సిబ్బందిని అడిగితే, పంజాగుట్ట - ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టేషన్ల మార్గంలో సాంకేతిక సమస్య ఏర్పడిందని తెలిపారు. కాబట్టి, ఎల్బీ నగర్ - మియాపూర్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అరగంట నుంచి ఇదే పరిస్థితి ఎదురు కావడంతో ప్రయాణికులు స్టేషన్ నుంచి కిందకి దిగి ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు.


ఈ క్రమంలో ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, అమీర్‌పేట్‌ తదితర స్టేషన్లలో రైళ్లు ఆగిపోయాయి. కొన్ని రైళ్లు మార్గం మధ్యలోనూ ఆగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లు ఆగిపోవడంతో కొందరు ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపట్లో సేవలను పునరుద్దరిస్తామని సిబ్బంది అనౌన్స్ చేయడంతో ప్రయాణికులు అందరికీ క్లారిటీ వచ్చినట్లు అయింది. అప్పటికే అర్జెంటుగా వెళ్లాల్సిన స్టేషన్ నుంచి కిందికి దిగి వెళ్లిపోయారు. అరగంట దాటాక పునరుద్దరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే సాంకేతిక లోపంతోనే సేవలకు అంతరాయం కలిగినట్టు తెలుస్తోంది.