Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌లో ప్రజా రవాణా వ్యవస్తను ఒకే తాటిపైకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, హైదరాబాద్ మెట్రో రైల్ కీలక ముందడుగు వేశాయి. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి, వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు కామన్ పాస్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం హైదరాబాద్ నగర రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుంది.
ఏంటీ ఈ కామన్ పాస్?
ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులకు, మెట్రో రైళ్లకు వేర్వేరుగా టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సిన వచ్చేది. కానీ రాబోయే రోజుల్లో ఒకే పాస్‌తో మెట్రో రైళ్లు, నగరంలోని వివిధ రకాల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంతేకాకుండా, మెట్రో స్టేషన్ల నుంచి గమ్య స్థానాలకు చేరుకోవడానికి ఆర్టీసీ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు ఈ కార్యాచరణను వేగవంతం చేశారు. ఇటీవల బస్ భవన్‌లో ఆర్టీసీ, హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్ అండ టీ మెట్రో అధికారులు సమావేశమై దీనిపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ కామన్ పాస్ విధానం వెనుక ప్రధానంగా మూడు లక్ష్యాలు ఉన్నాయి. ప్రయాణికులు ఆర్టీసీ బస్ దిగి మెట్రో ఎక్కేటప్పుడు లేదా మెట్రో నుంచి బస్‌కు మారేటప్పుడు పదే పదే టికెట్లు తీసుకోవాల్సి అవసరం ఉండదు. వేర్వరుగా పాస్‌లు తీసుకోవడం కంటే ఒకే పాస్ ఉండం వల్ల ప్రయాణికులకు ఛార్జీల భారం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో ప్రతి రోజూ 22 లక్షల మంది బస్సుల్లో4.7 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఉమ్మడి పాస్‌లు వస్తే సంఖ్య మరింత పెరగవచ్చు.
ఎప్పటి నుంచి అమల్లోకి?
ప్రస్తుతానికి దీనిపై ప్రాథమిక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి పాస్‌ల ఛార్జీల నిర్ధారణ, పాస్‌ల రూపకల్పనపై మెట్రో అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ వారంలోనే HUMTA ప్రతిపాదించిన ఉమ్మడి మొబైల్ యాప్ గురించి, ఛార్జీల గురించి మరోసారి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ధరలపై స్పష్టత వచ్చిన వెంటనే ఈ పాస్‌లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఎలా పని చేస్తుంది?
ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్న డైలీ, మంత్లీ పాస్‌లనే మెట్రోకు కూడా వర్తింపజేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు. అదనంగా ఇప్పటి వరకు లేని వీక్లీ పాస్ సౌకర్యాన్ని కూడా కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఆర్టీనరీ బస్‌లకు నెలకు 1600, మెట్రో ఎక్స్‌ప్రెస్‌కు నెలకు 1800, మెట్రో డీలక్స్‌కు 2200, డైలీ పాస్ 150 రూపాయలుగా వసూలు చేస్తున్నారు.
కామన్ పాస్ విధానం వస్తే, మెట్రోరైళ్లతోపాటు ఈ మూడు రకాల బస్‌లలోనూ ఒకే పాస్‌తో ప్రయాణించవచ్చు. అయితే మెట్రో రైళ్లకు మాత్రమే పరిమితమయ్యేలా డైలీ, వీక్లీ, మంత్లీ పాస్‌లను కూడా ప్రత్యేకంగా తీసుకురానున్నారు.
