Hyderabad Metro Rail: హైదరాబాద్ వాసుల జీవననాడి, ప్రతి రోజూ లక్షల మందిని గమ్య స్థానాలకు చేర్చే హైదరాబాద్‌ మెట్రో రైలు చరిత్రలో ఒక భారీ మార్పు చోటు చేసుకోబోతోంది. ఇప్పటి వరకు పబ్లిక్‌ ప్రైవేటు పార్టనర్‌షిప్‌ పద్ధిలో ఎల్‌ అండ్‌ టీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ మెట్రో ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో తన ఆధీనంలోకి తీసుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం నిర్ణయం తీసుకోవడమే కాకుండా, ఈ ప్రక్రియను ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పూర్తి చేయాలని గడువు విధించుకోవడం ఇప్పుడు నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. 

Continues below advertisement

మార్చి 31 డెడ్‌లైన్‌: మెట్రో రైలు టేకోవర్‌ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న ప్రభుత్వం దాన్ని మార్చి 31 నాటికి పూర్తి చేయాలని చూస్తోంది. ఈ భారీ బదిలీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఇప్పటికే కార్యదర్శులు స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ఇటీవల ఎల్‌ అండ్‌ టీ ఉన్నతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి, ప్రాజెక్టు బదిలీలో ఎదురయ్యే సవాళ్లు, పరిష్కారాలపై లోతుగా చర్చించింది. ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా ఉంది. ఏప్రిల్‌1 నాటికి మెట్రో రైలు కార్యకలాపాలు ప్రభుత్వ పర్యవేక్షణలోకి వచ్చేలా సర్వ సిద్ధం చేయడం. 

ఆర్థిక, న్యాయ చిక్కులు లేకుండా ఐడీబీఐ కసరత్తు: వేల కోట్ల రూపాయల ప్రాజెక్టును ఒక ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వం తీసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇందులో అనేక ఆర్థిక, న్యాయపరమైన మెలికలు ఉంటాయి. వీటికి పరిష్కరించడానికి ప్రభుత్వం ఐడీబీఐ సంస్థను ఫైనాన్స్‌, లీగల్‌ అడ్వైజర్‌గా నియమించింది. సమాచారం ప్రకారం ఐడీపీఐ సంస్థ ఇప్పటికే సమగ్రమైన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. ఎల్‌ అండ్ టీ సంస్థకు ప్రభుత్వం ఎంత మొత్తం చెల్లించాలి, బకాయిల పరిస్థితి ఏంటీ, ఒప్పంద పత్రాల్లోని నిబంధనలు ఎలా ఉన్నాయి అనే అంశాలై ఈ నివేదికలో స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రిపోర్టు ఆధారంగానే హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎల్‌ అండ్‌ టీ ప్రతినిధులు అంతిమ ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. 

Continues below advertisement

టెక్నికల్‌ కన్సల్టెంట్‌ నియామకం: ఇంజనీరింగ్‌అద్భుతంపై ఆడిట్‌ మెట్రో అనేది కేవలం రవాణా వ్యవస్థ మాత్రమే కాదు, అది ఒక సంక్లిష్టమైన సాంకేతిక వ్యవస్థ. నిర్మాణం నుంచి ఆపరేషన్స్‌ వరకు ప్రతి అడుగులోనూ సాంకేతికత  కీలకం అందుకే మెట్రో ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, ప్రస్తుత నిర్వహణ తీరు, రైళ్ల ఆపరేషన్స్‌ వంటి కీలక అంశాలను అంచనా వేయడానికి ప్రభుత్వం క టెక్నికల్‌ కన్సల్టెంట్‌ను నియమించలని నిర్ణయించింది. ఈ నియామక ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తికానుంది. ఈ కన్సల్టెంట్‌ ఇచ్చే సాంకేతిక నివేదిక, ఐడీబీఐ ఇచ్చిన ఆర్థిక నివేదికతో కలిపి మెట్రో టేకోవర్‌ ప్రక్రియకు ఒక పూర్తి స్థాయి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తుంది. 

ప్రజలకు కలిగే ప్రయోజనం ఏంటీ?  ప్రభుత్వ నిర్ణయం వెనుక లోతైన వ్యూహం కనిపిస్తోంది. మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే టికెట్ ధరల నియంత్రణ, మెట్రో రెండో దశ విస్తరణ పనుల్లో వేగం,  ఇతర ప్రజా రవాణా వ్యవస్థలతో మెట్రోను అనుసంధానించడం సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.