GHMC Property Tax: హైదరాబాద్ నగర ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే దశగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిల్ కార్పొరేషన్ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ బంపర ఆఫర్ ప్రకటించింది. నగరంలోని ప్రైవేటు, ప్రభుత్వం ఆస్తులకు సంబంధించి పేరుకుపోయిన పన్ను బకాయిలపై భారీ మినహాయింపులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
90 శాతం వడ్డీ మినహాయింపు: ఒకేసారి చెల్లింపుతో విముక్తి ఈ పథకం ప్రకారం ఆస్తి పన్ను బకాయి ఉన్న వినియోగదారులు తమ పెండింగ్ బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90 శాతం మినహాయింపును పొందవచ్చు. అంటే వినియోగదారులు తాము చెల్లించాల్సిన అసలు పన్నుతోపాటు కేవలం పది శాతం వడ్డీని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానం ద్వారా వేల సంఖ్యలో ఉన్న పన్ను చెల్లింపుదారులకు గొప్ప ఉపశమనం లభించనుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని రాల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు ఈ రాయితీ వర్తిస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు.
విస్తరించిన నగరానికి వర్తింపు: ఇటీవల గ్రేట్ హైదరాబాద్ పరిధిని ప్రభుత్వం భారీగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 20 పురపాలక సంఘాలు, ఏడు నగరపాలక సంస్థలన జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ విలీన ప్రక్రియతో బృహత్ నగరంగా అవతరించిన హైదరాబాద్‌లో కొత్త ప్రాంతాలను కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫర్ వర్తించనుంది. దీని వల్ల అటు ప్రజలకు వడ్డీ భారం తగ్గడమే కాకుండా ఇటు జీహెచ్‌ఎంసీకి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా నగర వాసులు తమ ఆస్తి పన్ను రికార్డులను క్లియర్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అప్పుల భారం లేకుండా నవ నగర నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.