Hyderabad Metro Rail Timings: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 25న జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ కారణంగా మెట్రో రైలు, టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. స్టేడియానికి మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకుల సౌకర్యార్థం మెట్రో రైలు, బస్సు సర్వీసుల టైమింగ్స్ ను పొడిగించాయి. ఈ మేరకు ఇరు సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. సాధారణంగా అయితే రాత్రి 11 గంటలకు చివరి మెట్రో రైలు టెర్మినల్ స్టేషన్ లో బయలుదేరుతుంది. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆఖరి ట్రైన్ ను 12.15కు నడిపించనున్నారు.


చివరగా రైళ్లు 12.15 గంటల వరకూ రాకపోకలు సాగించనుండగా.. ఆఖరి ట్రైన్ 1.10 గంటలకు గమ్య స్థానానికి చేరుకుంటుంది. అయితే, ఈ సమయంలో ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులను అనుమతించనున్నారు. అంతేకాక, ఈ మార్గంలో మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. ట్రైన్ ఎక్కడానికి అవకాశం లేదని మెట్రో అధికారులు స్పష్టంగా చెప్పారు.


ఉప్పల్‌ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని.. మెట్రో, ఆర్టీసీ సేవలు నడిపే సమయాన్ని పొడిగిస్తున్నారు. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు రానున్నారు. అందుకే ఉప్పల్ స్టేడియం మార్గంలో నడిచే మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. అలాగే ఆర్టీసీ బస్సులు నడిచే సమయాన్ని కూడా పొడిగించారు. ఉప్పల్ స్టేడియం నుంచి నగరంలోని వివిధ చోట్లకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు స్పెషల్ బస్సులను నడుపుతామని ప్రకటించారు. ప్రయాణికులు ఈ సేవలను ఉపయోగించుకుని తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.