హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా ఆమెపై ఓ వ్యక్తి నేరుగా ఆరోపణలు చేశాడు. ఏకంగా మీడియా ముందుకు వచ్చిన తనకు మేయర్ వల్ల అన్యాయం జరిగిందంటూ వాపోయాడు. మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆమె సోదరుడు తమ భూమిని అక్రమంగా లాక్కుంటున్నారని బుధవారం (డిసెంబరు 28) ఓ వ్యక్తి మీడియా ఎదుట ఆరోపించడం సంచలనంగా మారింది.
ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం మీర్జాపూర్‌లోని సర్వే నంబర్ 20లో పది ఎకరాల భూమిలో అదే గ్రామానికి చెందిన కొనింటి వడ్డె మల్లేశ్ కుటుంబ సభ్యులు వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి అది తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చిందని తెలిపాడు. సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ దొరసాని రాములమ్మ నుంచి తమ తాతలు ఈ భూమిని కొనుగోలు చేశారని చెప్పాడు. ఇందుకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని చెప్పాడు. 2004 వరకు ఆ భూమి కబ్జా రికార్డుల్లో తమ తాత వడ్డె ఎల్లయ్య పేరు పైన నమోదై ఉందని తెలిపాడు.
అయితే 2005లో దొరసాని సంబంధీకుడైన నర్సింహా రెడ్డి అప్పటి తహసీల్దార్ సహకారంతో భూమిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తమ భూమి చుట్టూ పాతిన స్తంభాలను హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి దగ్గరుండి తీసేయించేస్తున్నారని వాపోయారు. అదేంటని అడిగితే చంపేస్తామని తుపాకీతో బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2007లోనే ఈ భూవివాదంలో ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని హత్య చేసినట్లు వారు చెప్పారని వాపోయాడు. పోలీసులు కూడా వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారని వాపోయారు. ఇదిలా ఉండగా పరిగి ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి సదరు భూమిని పరిశీలించి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై మేయర్ విజయలక్ష్మిని వివరణ అడిగేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
బాధితుడు తెలిపిన వివరాలు ఇవీ..
‘‘1975వ సంవత్సరంలో దొరసాని రాములమ్మ వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిర్జాపూర్ గ్రామంలోని 32 ఎకరాల భూమిని 38 కింద మాకు ఇచ్చింది. మిగతా 32 ఎకరాల భూమిని ఆమె కొడుకు అయిన నర్సింహా రెడ్డికి రూ.3,251 ఇచ్చి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి ఈ భూమిలో మేమే కబ్జాలో ఉన్నాం కాబట్టి 1978 సంవత్సరంలో సీలింగ్ యాక్ట్ కింద రూ.1,447 తీసుకుని ప్రభుత్వం మాకు సర్టిఫికెట్లు ఇచ్చింది. అయితే, పూర్వీకులు చనిపోవటం వల్ల వాటిని ప్రభుత్వ రికార్టులో చేర్పించలేకపోయారు. కొంత భూమి మాత్రం రికార్డుల్లో చేరటంతో పాస్ పుస్తకాలు వచ్చాయి.
మిగతా భూమిని 2005లో కే కేశవరావు కొడుకు వెంకటేశ్వరావు, నర్సింహ రెడ్డికి విరాసత్ కింద 10 ఎకరాలకు పాస్ బుక్ సృష్టించి, 2007లో ఆ భూమిని ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లోనే గన్‌తో బెదిరించారు. ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తిని చంపేశారు. వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుపడ్డాడు. అందరం ఎదురు తిరగటంతో మీ భూమి మీకు ఇచ్చేస్తానని చెప్పాడు. మళ్లీ ఇప్పుడు భూమి రేట్లు పెరగటంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పోలీసులను పెట్టుకుని మరీ ఫెన్సింగ్ వేస్తున్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేశాడు. దీని ఒరిజినల్ డాక్యుమెంట్లతో పాటు వాళ్లు సృష్టించిన నకిలీ పత్రాలు కూడా మా దగ్గర ఉన్నాయి’’ అని బాధితులు మీడియాకు చెప్పారు.