IT Employees Protest in Hyderabad:


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో టెకీలు ఆందోళన ఉధృతం చేశారు. చంద్రబాబు వల్లనే ఐటీ అభివృద్ధి చెందిందని, ఇప్పుడు కూడా బయటకు రాకపోతే మేము వేస్ట్ అన్నారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టెకీలు, యువత నల్ల రిబ్బన్లతో నిరసనకు దిగారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు హయాంలో ఐటీని ఆయన అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని చెప్పారు. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. 
హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకం
చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం అన్నారు. చంద్రబాబు కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసం ప్రజలందరూ బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకమని గుర్తుచేశారు.  స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. కానీ కావాలనే కుట్ర చేసి బాబును జైలుకు పంపారని ఆరోపించారు. తాను అవినీతి పరుడు అయితే మిగతా వాళ్లు కూడా అలాగే ఉంటారని జగన్ భ్రమిస్తున్నారని చెప్పారు. 






ఉపాధినిచ్చిన స్కిల్ డెవలప్మెంట్ 
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎందరికో ఉపాధి లభిస్తుందన్నారు. చాలా మంది దాని ద్వారా సొంత కాళ్ల మీద నిలబడ్డారు. కానీ చంద్రబాబును కావాలనే అరెస్ట్ చేసి వేధిస్తున్నారని టెకీలు ఆరోపించారు. ఏపీలో అన్ని శాఖలు ఇవాళ జగన్ చేతుల్లో కీలు బొమ్మలుగా మారాయన్నారు. చంద్రబాబు విజన్ కారణంగానే నేడు సైతం ఏపీ యువత సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం హైదరాబాద్ కు వస్తున్నారని, దేశంలో నేడు ఇక్కడినుంచి ఐటీ ఎగుమతులలో మెరుగైన స్థానానికి టీడీపీ అధినేత కారణం అన్నారు.


ఏపీలో సైకో పాలన నడుస్తుందని, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమంటూ సాఫ్ట్ వేర్ కంపెనీల ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎక్కడా అభివృద్ధి లేదు. ఎక్కడిక్కడ అన్యాయం, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమ పిల్లల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు ముందుకు రావాలని టెకీలు పిలుపునిచ్చారు.


భారీగా తరలివచ్చిన టీడీపీ సానుభూతిపరులు..
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి అని ఆరోపించి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ సానుభూతిపరులు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విప్రో సర్కిల్ వద్దకి వచ్చి టెకీలతో కలిసి నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. విజన్, డెవలప్ మెంట్ అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు అని అలాంటి నేతను అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెకీలు, టీడీపీ మద్దతుదారుల నిరసనతో విప్రో సర్కిల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించివేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు సర్దిచెప్పినా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకునేలా కనిపిస్తోంది. కేసు కోర్టులో ఉందని, శాంతియుతంగా నిరసన తెలపాలని పోలీసులు వారికి సూచిస్తున్నారు.