హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఓ ఐటీ కంపెనీ మోసానికి తెగబడింది. రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసి, కంపెనీని ఎత్తేసి నమ్ముకున్న వారిని నట్టేట ముంచింది. ఎంతో మంది నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి మూటముల్లే సర్దేసి పరార్ అయింది. సాఫ్ట్ వేర్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి, దాంతో పాటు ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పి నమ్మించి ఏకంగా రూ.కోట్లు డబ్బులు గుంజి ఇప్పుడు కనిపించకుండా పోయారు. 


దీనికి సంబంధించి మాదాపూర్‌ పోలీసులు వివరాలు వెల్లడించారు. ఏపీలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు బిజినేపల్లి ప్రేమ్‌ప్రకాష్‌ అనే 44 ఏళ్ల వ్యక్తి సనత్‌ నగర్‌లో నివాసం ఉంటూ తన స్నేహితుడు లిఖిత్‌తో కలసి గత ఏడాది కొండాపూర్‌ వెస్ట్రన్‌ పెరల్‌ భవనంలో సంట్ సూ ఇన్నోవేషన్స్‌ అనే పేరుతో ఐటీ కంపెనీ మొదలు పెట్టాడు. తమ కంపెనీలో ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెప్పి ఒక్కో నిరుద్యోగి వద్ద రూ.లక్ష నుంచి లక్షన్నర దాకా వసూలు చేశాడు. అలా డబ్బులు చెల్లించి కంపెనీలో చేరిన వారికి రెండు నెలలు జీతాలు కూడా ఇచ్చారు. దీంతో అందరు ఉద్యోగులు వారి మాటలు నమ్మేశారు. దాంతో మరింత మంది ఉద్యోగం, శిక్షణ కోసం డబ్బులు కట్టారు. 


కంపెనీ నిర్వహకుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆదివారం (సెప్టెంబరు 3) పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులు ప్రేమ్ ప్రకాష్‌, లిఖిత్‌లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. నిందితులు దాదాపు రూ.3 కోట్లు వసూలు చేశారని సమాచారం.