MMTS Trains: కొత్తగా మరో 4 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెడుతూ దక్షిణ మధ్య రైల్వే జోన్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ సబర్బన్ లో ఈ కొత్త ఎంఎంటీఎస్ లు సేవలు అందించనున్నాయి. ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను మేడ్చల్-లింగంపల్లి, మేడ్చల్- హైదరాబాద్ స్టేషన్ల మధ్య కొత్తగా నాలుగు సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నెల 1 నుంచే ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తూ శుక్రవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడుస్తున్న మూడు వందే భారత్ రైళ్లను అందుకునేందుకు వీలుగా ఉండే ఉండే విధంగా ఎంఎంటీఎస్ రైళ్లను అనుసంధానిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రకటించింది. అందుకు సంబంధించిన నూతన టైమ్ టేబుల్ ను కూడా విడుదల చేసింది. అందుకోసం సికింద్రాబాద్ - ఉమ్‌దానగర్, ఫలక్‌నుమా - సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య కూడా ఎంఎంటీఎస్ సర్వీసులను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
రోజూ మేడ్చల్ లో ఉదయం 7.20 గంటలకు, మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంఎంటీఎస్ సేవలు ఉంటాయి. అలాగే, లింగంపల్లి నుంచి ఉదయం 10.20 గంటలకు, సాయంత్రం 6.10 గంటలలకు ఎంఎంటీఎస్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఆదివారం సర్వీసులు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే, మేడ్చల్ - హైదరాబాద్ కు సంబంధించిన సర్వీసు ఉదయం 11.50 గంటలకు మేడ్చల్ లో బయల్దేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 1.40 గంటలకు హైదరాబాద్ లో స్టేషన్ నుంచి బయల్దేరుతుంది.
కొత్త ఎంఎంటీఎస్ సేవలు విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, మహిళలు, ఉద్యోగులు మొదలైన వారికి ప్రయోజనకరంగా ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. కొత్త టైమ్ టేబుల్ కార్యాలయాలకు వెళ్లే వారి ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు చెప్పారు.