పండుగ పూట హైదరాబాద్‌లో ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తార్నాకలో ఒకే కుటుంబానికి నలుగురు చనిపోవడం కలకలం రేపింది. తల్లి, భార్యతో పాటు కూతుర్ని హత్య చేసిన తరువాత ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. కుటుంబ కలహాలతోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురివి హత్య కాగా, ఒకరిది ఆత్మహత్య కావడం గమనార్హం. చనిపోయిన వారిలో భార్యాభర్తలు, ఓ బాలిక, ఓ పెద్దావిడ ఉన్నారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన కుటుంబం చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే మరేదైనా కారణం ఉండొచ్చా అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.


పోలీసుల కథనం ప్రకారం..
చెన్నైకి చెందిన ప్రతాప్ (32) తన భార్య సింధూర (32), నాలుగేళ్ల బాలిక ఆధ్యా, ప్రతాప్ తల్లి జయతి హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. ప్రతాప్ ఓ కార్ షో రూములో డిజైన్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. సింధూర ఓ ప్రైవేట్ బ్యాంకులో మేనేజర్ గా చేస్తోంది. తార్నాక లో నివాసం ఉంటున్న ప్రతాప్ కుటుంబంలో హైదరాబాద్ నుండి చెన్నైకు కుటుంబాన్ని షిఫ్ట్ చేయడంపై చర్చ జరుగుతోంది. ఇదే వ్యవహారంపై భార్యాభర్తలు ప్రతాప్, సింధూర మధ్య గత కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. 


ముగ్గురిని హత్య చేసి, ఆపై ప్రతాప్ ఆత్మహత్య
చెన్నైకి తిరిగి వెళ్లి పోవడంపై తరచుగా భార్యను అడుగుతున్నాడు ప్రతాప్. అయితే చెన్నైకు వెళ్లడానికి భార్య సింధూర నిరాకరించింది. దీనిపై ఇద్దరి మధ్య గత వారం రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కుటుంబాన్ని చంపి, తాను చనిపోవాలని దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు ప్రతాప్. కరెంట్ వైరుతో కుటుంబసభ్యులను గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. భార్య సింధూరను, నాలుగేళ్ల కూతురు ఆధ్యను, తన తల్లిని ఓ వైర్ తో గొంతు నులిమి ఉపిరాడకుండా చేసి ఒక్కొక్కరిగా ముగ్గురిని హత్య చేశాడు ప్రతాప్. ఆపై తాను అనుకున్నట్లుగానే అనంతరం తాను ఉరివేసుకొని ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్‌మెంట్ వాసుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అయితే కుటుంబ కలహాలతోనే ముగ్గురుని హత్య చేసి ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.