సైబర్‌ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఎవరైనా సరే లెక్కచేయడండా వేధింపులకు దిగుతున్నారు. తమను ఎవరూ కనిపెట్టలేరు.. ఏమీ చేయలేరు  అన్న ధీమాతో బరితెగిస్తున్నారు. సామాన్యులనే కాదు... ఐపీఎస్‌లను కూడా టార్గెట్‌ చేస్తున్నారు. ప్రొబేషనరీ ఐపీఎస్‌ను సైబర్‌ నేరగాళ్లు వేధింపులకు గురిచేయడం కలకలం  రేపుతోంది.


హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఓ ప్రొబెషనరీ ఐపీఎస్‌కు... సైబర్ ముఠా వీడియో కాల్ చేసింది. ప్రొబెషనరీ ఐపీఎస్‌ కాల్‌ లిఫ్ట్‌ చేశారు.  అటు వైపు నుంచి మాట్లాడుతున్న యువతి... ఉన్నట్టుండి నగ్నంగా మారింది. దీంతో వెంటనే కాల్‌ కట్‌ చేశారు ప్రొబెషనరీ ఐపీఎస్‌. అయితే.. అప్పటికే కాల్‌ రికార్డ్‌ చేసింది ఆ  సైబర్‌ ముఠా. ఆ వీడియోను ప్రొబేషనరీ ఐపీఎస్‌కు పంపి వేధింపులకు దిగింది. డబ్బులు పంపాలంటూ డిమాండ్‌ చేస్తోంది. దీంతో... సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ప్రొబెషనరీ ఐపీఎస్‌.


ఇప్పటి వరకు సామాన్యులను... కొందరు అధికారులను కూడా వేధించిన సైబర్‌ నేరస్తులు.. ఇప్పుడు పోలీసుల వరకు వచ్చారు. ఐపీఎస్‌లను కూడా టార్గెట్‌ చేస్తున్నారు. పోలీసులకు కూడా దొరక్కుండా తప్పించుకోగలమన్న ధీమాతో.. ఇంతగా బరితెగిస్తున్నాయి సైబర్‌ గ్యాంగ్‌లు. సైబర్‌ నేరగాళ్ల వేధింపులకు చాలా మంది బలవుతున్నారు. పరువు పోతుందన్న భయం... అవమాన భారం భరించలేకపోతున్నారు. వీటినే ఆయుధాలుగా చేసుకుని రెచ్చిపోతున్నాయి సైబర్‌ గ్యాంగ్‌లు. ఎంతటి వారయితే ఏం... మా వలలో చిక్కితే అంతే అంటూ... వేధింపులకు దిగుతున్నారు. ఈ సైబర్‌ రాకాసుల పని పట్టకపోతే... ఇంకెంత వారి వలలో చిక్కుని నరకం చూస్తారో ఏమో.


అత్యాధునిక టెక్నాలిజీ సాయంతో రెచ్చిపోతున్నాయి ఈ సైబర్‌ గ్యాంగ్‌లు. వీరికి చెక్‌పెట్టపోతే.. రోజురోజుకూ ఆగడాలు పెరగిపోయే అవకాశం ఉంది. ప్రొబెషనరీ ఐపీఎస్‌నే వేధిస్తున్నారంటే... వీరి ధీమా ఏంటి? వీరి అక్రమాలకు, ఆగడాలకు అంతమెక్కడ? సైబర్‌ నేరస్తులకు చెక్‌ పెట్టేదెప్పుడు? సామాన్యులకు సైబర్‌ నేరస్తుల నుంచి రక్షణ కలిగేది ఎప్పుడు?